గులాబీకి సవాల్‌.. | Sakshi
Sakshi News home page

గులాబీకి సవాల్‌..

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

ఖమ్మం లోక్‌సభ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

నాడు అధికారంలో..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్‌ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి.

ఇప్పుడు భారీ వ్యత్యాసం

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్‌ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది.

ఖమ్మం లోక్‌సభ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఎదురీత

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు

ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు

2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం

ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠ

పట్టు దొరికేది ఎక్కడ..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్‌ఎస్‌ అభ్య ర్థులు కాంగ్రెస్‌ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్‌ఎస్‌ నేతలు మునిగితేలుతున్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి, బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లు..

నియోజకవర్గం కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌

ఖమ్మం 1,36,016 86,635

పాలేరు 1,27,820 71,170

సత్తుపల్లి 1,11,245 91,805

మధిర 1,08,970 73,518

వైరా 93,913 60,868

కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555

అశ్వారావుపేట 74,993 46,088

మొత్తం 7,33,293 4,67,639

Advertisement
Advertisement