పోలీసుల కళ్లుగప్పి స్టేషన్‌ నుంచి పరార్‌.. 11 రోజులుగా వెతుకులాట | Sakshi
Sakshi News home page

పోలీసుల కళ్లుగప్పి స్టేషన్‌ నుంచి పరార్‌.. 11 రోజులుగా వెతుకులాట

Published Wed, Jun 7 2023 1:02 AM

- - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ పోలీసుల కళ్లుగప్పి స్టేషన్‌ నుంచి పారిపోయిన దొంగ టేకం రామారావు అజ్ఞాతం వీడలేదు. అతను పరారై నేటికీ పదకొండు రోజులు. పోలీసులు దొంగ ఆచూకీ కనిపెట్టడడం కోసం విఫలయత్నం చేస్తున్నారు. ఓ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి తమ నుంచి తప్పించుకోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. తొలుత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి.. ‘ఆసిఫాబాద్‌లో ఓ దొంగ సంచరిస్తున్నట్లు.. అతని ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తాం’ అని ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగ స్టేషన్‌ నుంచి పరారైన విషయాన్ని ‘సాక్షి’ ఈ నెల 1న వెలుగులోకి తీసుకురావడంతో అసలు రంగు బయటపడింది. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి సీరియస్‌ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

స్టేషన్‌లో ఉంచి విచారణ..
ఆసిఫాబాద్‌ పట్టణ కేంద్రంలోని తారకరామ నగర్‌లో నివసిస్తున్న రిటైర్డ్‌ టీచర్‌ గుర్రాల వెంకటేశం ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. బంగారు ఆభరణాలతోపాటు నగదు పోయినట్లు సమాచారం. దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ఇది టేకం రామారావు పనేనని నిర్ధారణకు వచ్చి గాలిస్తుండగా.. ఈ క్రమంలోనే రామారావు తన సోదరుడిని కలిసేందుకు ఆసిఫాబాద్‌ వచ్చాడు. కేస్లాపూర్‌లో రామారావు ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు గత నెల చివరి వారంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మే 27న టేకం రామారావుని తారకరామనగర్‌కు తీసుకొచ్చి దొంగతనం జరిగిన తీరుపై పోలీసులు సీన్‌ రీకన్స్‌స్ట్రక్షన్‌ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం దొంగను స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడింది.. సొత్తును ఎక్కడ దాచింది.. విక్రయించింది.. తదితర అంశాలపై ఆరా తీశారు. కొన్ని రోజులపాటు రామారావుని స్టేషన్‌లో బేడీలతో ఉంచినట్లు చూసిన కొందరు పేర్కొంటుండగా.. 28న మాత్రం అతని బేడీలు తొలగించి ఉంచినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా భావించి దొంగ పరారయ్యాడు. ఈ విషయం తెలిసి తొలుత గాబరా పడ్డ పోలీసులు తర్వాత తీరిగ్గా ‘ఆచూకీ తెలిపితే పారితోషికం’ అనే నాటకానికి తెరతీయడం విశేషం.

పోలీసు బాస్‌ సీరియస్‌..
‘గతంలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలు, ఇతర ప్రాంతాల్లో అనేకసార్లు దొంగతనాలకు పాల్పడ్డ టేకం రామారావు ప్రస్తుతం ఆసిఫాబాద్‌ పట్టణంలో దొంగతనం చేయడమే లక్ష్యంగా సంచరిస్తున్నాడు. ఇతన్ని ఎవరైనా చూసినా.. అతని ఆచూకీ తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దొంగ ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.’ అంటూ మే నెల 30న ఒక ప్రకటన స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి విడుదల చేయగా.. అందరూ నిజమేనని నమ్మారు. కానీ తమ్ముడి ఆచూకీ తెలపాలంటూ అన్నను రెండు రోజులపాటు పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించడం.. అతని ఊరంతా పోలీసు వాహనంలో కూర్చొబెట్టి రామారావు కోసం గాలించడం తెలిసిన తరువాత దొంగ పరారైన విషయం ‘సాక్షి’ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై ఎస్పీ కె.సురేశ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. పారిపోయిన దొంగను వెంటనే పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అలాగే దొంగ పారిపోయిన ఘటనపై విచారణకు ఆదేశిస్తూ.. ఆ సమయంలో స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత దొంగ పారిపోవడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement