‘ప్రైవేట్‌’కే వరి ధాన్యం | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’కే వరి ధాన్యం

Published Fri, Nov 24 2023 7:38 AM

రెబ్బెన మండలం ఇందిరానగర్‌లో వరిధాన్యం కుప్పలు - Sakshi

● జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్న వరికోతలు ● జాడలేని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ● మబ్బులతో ఆందోళనలో అన్నదాతలు ● దళారులకు విక్రయిస్తూ.. ఆర్థికంగా నష్టపోతున్న రైతులు ● త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామంటున్న అధికారులు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): ‘రైతులు ప్రైవేటు వ్యాపారులు.. దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి.. అప్పుడే మద్దతు ధర లభిస్తుంది..’ ఇవి అధికారులు తరచూ చెబుతున్న మాటలు.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. బోర్ల కింద ముందుగా సాగు చేసిన పంటలు ఇప్పటికే కోతలు పూర్తి కాగా చెరువులు, కుంటలు, కాలువల కింద సాగు చేసిన ఇప్పుడిప్పుడే కోతలు మొదలయ్యాయి. అయినా జిల్లా అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరో వైపు మబ్బులు అన్నదాతలను భయపెడుతున్నాయి. ఫలితంగా రైతులు మధ్యవర్తులు, దళారులను ఆశ్రయిస్తూ ప్రైవేటుకు విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. తూకంలో కోతలు, హమాలీ ఖర్చులు లేకుండానే ప్రైవేటు వ్యక్తులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు.

56,300 ఎకరాల్లో సాగు

వానాకాలం సీజన్‌లో జిల్లా రైతులు 56,300 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. బోర్లు, కుంటలు, చెరువులు, కాలవ కింద జోరుగా వరి సాగైంది. సీజన్‌ మధ్యలో విజృంభించిన తెగుళ్లు రైతులను కలవరపెట్టాయి. రసాయనిక మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకున్నారు. పంటలు ఆశాజనకంగా మారడంతో జిల్లాలో సుమారు 42 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం వరికోతల ప్రక్రియ ఊపందుకోగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లా అధికారులు అన్నిశాఖలతో సమీక్షలు చేసినా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు కానరాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు దూరమవుతున్నారు.

సన్నాలన్నీ ‘ప్రైవేటు’కే

జిల్లాలోని సన్నరకం ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులే ఎగరేసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యంలో మిల్లర్లు తూకంలో భారీగా కోతలు విధించడం, హమాలీ ఖర్చులు తడిసి మోపెడు కావడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి రూ.2203, సాధారణ రకానికి రూ.2,183 చెల్లిస్తోంది. అయితే ప్రైవేటులో సన్నరకం ధాన్యానికి మద్దతు ధరకు మించి రేటు వస్తుండటంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో కోతలు పూర్తికాగానే కల్లాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు కోతలు పూర్తయిన చోట సన్నరకం ధాన్యంలో 90శాతం ప్రైవేటుకే విక్రయించారు. అయితే దొడ్డురకం ధాన్యాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నా క్వింటాల్‌కు రూ.1,650 నుంచి రూ.1,750 వరకే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక క్వింటాల్‌కు రూ.450 నుంచి రూ.550 వరకు నష్టపోవాల్సి వస్తోంది. కేంద్రాలను తెరిచే వరకు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అద్దెకు తెచ్చిన టార్పాలిన్ల కిరాయిలతో అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు త్వరగా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

నెలాఖరులోగా ప్రారంభిస్తాం

ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా చూస్తాం. రెండు, మూడు రోజుల్లో మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమావేశం పూర్తి కాగానే కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. సాధారణంగా ఇతర జిల్లాలతో పోల్చితే కుమురంభీం జిల్లాలో నెలరోజులు ఆలస్యంగా వరికోతలు మొదలవుతాయి. ఈసారి ఎన్నికల విధుల కారణంగా మిల్లర్లతో సమావేశం ఆలస్యమైంది.

– తారామణి, డీసీవో

Advertisement

తప్పక చదవండి

Advertisement