బందరుపోర్టుతో సమగ్రాభివృద్ధి సాధ్యం | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2023 1:30 AM

- - Sakshi

ఉయ్యూరు: బందరు పోర్టుతో జిల్లా ముఖచిత్రం మార్పు చెందుతుందని, జిల్లా సమగ్ర ప్రగతి సాధిస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. మండలంలోని చిన ఓగిరాల పీహెచ్‌సీలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంస్థ రూ. 12.60 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన వైద్య పరికరాలను ప్రారంభించి, గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ. 50 లక్షల వ్యయం అంచనాతో నిర్మించనున్న లైబ్రరీ, కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ డచ్‌ హయాంలోనే బందరు పోర్టు నిర్మించాలనుకున్నారన్నారు. 1,700 ఏళ్ల నుంచి బందరు పోర్టు కల సాకా రం కాకుండా మిగిలిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నత లక్ష్యంతో పోర్టు నిర్మా ణ పనులు కార్యరూపం దాల్చుతున్నాయన్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహకారంతో పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నామని వివరించారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌..

ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారన్నారు. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి పరికరాలను అందుబాటులోకి తెచ్చి గ్రామీణులకు సేవలు అందుబాటులోకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌ శర్మ, ఈడీ ఆలీషా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ గీతాబాయి, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ ఇందిరాదేవి, ఎంపీపీ చీలి కల్పన, ఏఎంసీ చైర్మన్‌ వల్లభనేని వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ వల్లభనేని సత్యనారాయణ, సర్పంచ్‌ వెనిగళ్ల శిరీష తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో..

అవనిగడ్డ: పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆదివారం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.71 లక్షలతో అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలు, బెడ్స్‌ను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌శర్మ, ఈడీ ఆలీషా అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ కార్పొరేషన్‌ సీఎస్‌ఆర్‌ నిధులు తొలి విడత రూ.5.07 కోట్లతో బందరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో అధునాతన పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు.

కృతజ్ఞతలు..

ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి సహకరించిన ఎంపీ బాలశౌరికి, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ గీతాబాయి, డాక్టర్‌ మాధవి, సూపరింటెండెంట్‌ విజయ్‌ కుమార్‌, ఎంపీపీ తుంగల సుమతీదేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ గొరుముచ్చు ఉమా పాల్గొన్నారు.

బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి చిన ఓగిరాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అవనిగడ్డ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన

బాలశౌరి చొరవతో..

ప్రభుత్వ ఆస్పత్రులకు అధునాతన వైద్య పరికరాలు మంజూరు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి పలుమార్లు తమకు విన్నవించారనిపవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌శర్మ తెలిపారు. ఆయన చొరవ కారణంగానే తమ సీఎస్‌ఆర్‌ నిధులు భారీ స్థాయిలో సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు మంజూరు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనా విధానాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పీఎఫ్‌సీని ఒప్పించి ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ.4వేల కోట్లు రుణం మంజూరు చేయించారని వివరించారు.

Advertisement
Advertisement