ఇయర్‌ బడ్స్‌ విషయమై స్నేహితులు కొట్టడంతోనే మృతి | Sakshi
Sakshi News home page

ఇయర్‌ బడ్స్‌ విషయమై స్నేహితులు కొట్టడంతోనే మృతి

Published Wed, May 10 2023 11:10 AM

విలేకరులతో మాట్లాడుతున్నపోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా. పక్కన ఎస్పీ జాషువా  - Sakshi

విజయవాడ: కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిడమానూరు ప్రాంతంలో సోమవారం జరిగిన చెన్నూరు అజయ్‌సాయి (23) హత్యకు గంజాయి మత్తు కారణం కాదని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా, కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా స్పష్టం చేశారు. ఇయర్‌ బడ్స్‌ విషయమై స్నేహితులు కొట్టడం వల్లే తీవ్రంగా గాయపడి మృతి చెందాడని తెలిపారు. గంజాయి మత్తులో దాడి జరిగిందంటూ అసత్య ప్రచారం చేయడం, ప్రతి దానికీ గంజా యితో ముడిపెట్టడం తగదని మీడియాకు సూచించారు. సీపీ రాణా, ఎస్పీ జాషువా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఘటన వివరాలను వెల్లడించారు.

పెనమలూరుకు చెందిన అజయ్‌సాయి, మణికంఠ, నాగార్జున మరో ముగ్గురు స్నేహితులని తెలిపారు. వారంతా ఈ నెల ఏడో తేదీన పెనమలూరు ప్రాంతంలో సంతోష్‌ అనే స్నేహితుడి ఇంట్లో గడిపారని, అతని ఐఫోన్‌ ఇయర్‌ బడ్స్‌ కనిపించకపోవడంతో అజయ్‌సాయిని ప్రశ్నించారని పేర్కొన్నారు. అతను ఒకసారి తీశానని, మరోసారి తీయలేదని పొంతనలేకుండా చెప్పడంతో స్నేహితులు ఐదుగురు సోమవారం రాత్రి నిడమానూరులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలు, చేతులతో దాడి చేయడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడని వివరించారు.

అనంతరం ముగ్గురు అక్కడి నుంచి పరారవగా, నాగార్జున, మణికంఠ కలిసి అజయ్‌సాయిని సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి మూర్చతో అపస్మారక స్థితికి వెళ్లాడని డాక్టర్‌కు చెప్పారని తెలిపారు. కొద్ది సేపటికే అజయ్‌సాయి మరణిం చడం, అతని ఒంటిపై దెబ్బలు ఉండటాన్ని గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని అజయ్‌సాయి హత్యకు గురయ్యాడని నిర్ధారించుకుని విచారణ ప్రారంభించారని పేర్కొన్నారు.

ఘటన వెలుగు చూసిన గంటల వ్యవధిలోనే నాగార్జున, మణికంఠ, మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణాజిల్లా సరిహద్దులో జరిగిన ఈ ఘటనపై రెండు జిల్లాల పోలీసు యంత్రాంగం సమన్వయంతో విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని ఎస్పీ జాషువా తెలిపారు.

గంజాయి కట్టడికి పటిష్ట చర్యలు
ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో గంజాయి మూలాలను పెకిలించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని సీపీ రాణా, ఎస్పీ జాషువా తెలిపారు. డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలతో గంజాయి విక్రయ, సరఫరాదారులతో పాటు గంజాయి తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తూ గంజాయి చైన్‌ లింక్‌ను ఛేదిస్తున్నామని స్పష్టంచేశారు. గడిచిన ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాపై ఎన్టీఆర్‌ జిల్లాలో 84 కేసులు నమోదు చేశామని, 284 మందిని అదుపులోకి తీసుకున్నామని, 251 కేజీల గంజా యిని స్వాధీనం చేసుకున్నామని, ఏడుగురిని జిల్లా బహిష్క రణ చేశామని, నలుగురిపై పీడీ యాక్ట్‌ అమలు చేసి రాజ మండ్రి సెంట్రల్‌ జైలుకు పంపామని వివరించారు.

గంజాయి తాగే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని చెప్పారు. కృష్ణాజిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై 91 కేసులు నమోదు చేసి 324 మందిని అరెస్ట్‌ చేసి, 154 కేజీల గంజా యిని సీజ్‌ చేశామని, 19 మంది గంజాయి సరఫరా దారు లపై పీడీ యాక్ట్‌ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ ఫైల్‌ జిల్లా కలెక్టర్‌ వద్ద ఉందని పేర్కొన్నారు. గంజాయి దుష్ఫరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాతీయ, ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు, విద్యా సంస్థల వద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని డీ–ఎడిక్షన్‌ సెంటర్ల ద్వారా సన్మార్గంలోకి తీసుకొస్తున్నామన్నారు. స్నేహితుల మధ్య జరిగిన వివాదాలకు గంజాయితో ముడిపెట్టడం తగదని మీడియాకు హితవు పలికారు. నిజానిజాలు తెలుసుకున్న తరువాతనే వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇద్దరు గంజాయి సరఫరాదారులపై పీడీ యాక్ట్‌
విజయవాడ స్పోర్ట్స్‌: ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి లోని ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ టి.కె. రాణా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన బొంతుల దుర్గా రావు అలియాస్‌ గొంతులుపై గతంలో 12 కేసులు, పాయకాపురం శాంతినగర్‌కు చెందిన మున్నంగి సురేష్‌పై 10 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. గంజా యిని సరఫరా చేస్తున్న వారిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. జైలు జీవితం గడిపినా వారి ప్రవర్తనలో మార్పు లేకపోవడం, యువతను మత్తుకు బానిసలు చేస్తుండటంతో ఇద్దరిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తున్నా మని తెలిపారు. గంజాయి, ఇతర మత్తుపదార్ధాలు జిల్లాలోకి ప్రవేశించకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement