సెల్‌ఫోన్‌లో వాయిస్‌తో బైక్ ఆపరేటింగ్ | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో వాయిస్‌తో బైక్ ఆపరేటింగ్

Published Sat, May 27 2023 1:04 AM

సెల్‌ఫోన్‌ వాయిస్‌ ద్వారా బైక్‌ను ఆపరేట్‌ చేస్తున్న ప్రణయ్‌ - Sakshi

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నంకు చెందిన యువకుడు కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బాల్యం నుంచి సైన్స్‌ పట్ల ఆసక్తి ఉన్న రాసంశెట్టి ప్రణయ్‌ విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో సీఈసీ బ్రాంచ్‌లో నెల రోజుల కిందటే బీటెక్‌ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్‌తో వాయిస్‌ ద్వారా బైక్‌ ఆపరేటింగ్‌ విధానాన్ని కనుగొన్నాడు. మచిలీపట్నం నగరపాలక సంస్థ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాసంశెట్టి వాణిశ్రీ, చంటి దంపతుల కుమారుడే ఈ ప్రణయ్‌.

సెల్‌ఫోన్‌లో వాయిస్‌ వినిపించటంతో బైక్‌ సెల్ప్‌, కిక్‌, తాళం లేకుండానే ఆన్‌ అయ్యేలా రెండు రోజుల క్రితం తన బైక్‌కు అమర్చాడు. బ్లూటూత్‌ వాయిస్‌ ద్వారా బైక్‌ సీటు కింద అమర్చిన ఆర్డినోబోర్డ్‌ పని చేయటం ద్వారా ఇది పనిచేసేలా రూపొందించాడు. అతని బండి పేరు లక్కీ కావటంతో అన్‌లాక్‌ లక్కీ అంటే మీటరు ఆనయ్యేలా, స్టార్ట్‌ లక్కీ అంటే స్టార్ట్‌ అయ్యేలా, స్టాప్‌ అంటే ఆగేలా దీనిని రూపొందించాడు. 15 నుంచి 20 మీటర్ల దూరం నుంచి బండిని ఆపరేటింగ్‌ చేసినా ఇది పనిచేస్తోంది. వెయ్యి రూపాయల ఖర్చుతో దీనిని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే పలు ఆవిష్కరణలకు ప్రణయ్‌ ప్రయత్నిస్తూ ఫలితాలను సాధిస్తున్నాడు. నూతన ఆవిష్కరణలు చేస్తున్న ప్రణయ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అభినందించారు.

ఆవిష్కరణలు ఇవే....
► ప్రణయ్‌ తాతయ్య కమ్మిలి మాధవరావు వృద్ధాప్యంతో ఉండటంతో టీవీ, ప్యాన్‌, లైట్ల స్విచ్‌లు వేసేందుకు వెళ్లటం ఇబ్బందిగా ఉండటంతో ఆయన కోర్కె మేరకు వీటిని రిమోట్‌, ఫోన్‌ వాయిస్‌ ద్వారా కంట్రోల్‌ చేసేలా తయారుచేశాడు. దీనిని మాధవరావు గత ఏడాదిగా వినియోగిస్తున్నారు.

► 2022 ఆగస్టులో ఉత్తరాఖండ్‌లో జరిగిన స్మార్ట్‌ ఇండియా హ్యాక్‌థాన్‌ పోటీల్లో ప్రణయ్‌ నేతృత్వం వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయిలో ప్రథమస్థానాన్ని సాధించి లక్ష రూపాయల బహుమతి అందుకోవటం జరిగింది. బ్లూ వాయిస్‌ సీఎన్‌సీ మిషన్‌ రైటింగ్‌ అనే ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. ఈ మిషన్‌ వల్ల రాయడానికి వీలు లేని దివ్యాంగులు రాతపరీక్షకు హాజరైతే వేరే వ్యక్తులు అవసరం లేకుండా ఈ మిషన్‌ వాయిస్‌ ద్వారా పరీక్ష రాస్తుంది. జాతీయస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 150 ప్రదర్శనలు రాగా ప్రణయ్‌ బృందం ప్రదర్శన జాతీయస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది.

► ప్రణయ్‌ ఇంట్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు నీటి సరఫరాకు మోటారు నిర్వహణ చేసేందుకు మూడేళ్ల క్రితమే సెన్సార్ల ద్వారా పని చేసే విధానాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా వాటర్‌ ట్యాంకులో నీరు ఖాళీ అయినప్పుడు మోటార్‌ ఆనవ్వటం, ట్యాంకు నీటితో నిండగానే మోటారు ఆగిపోవటం జరుగుతోంది.

► ఆటోమేటిక్‌ బాత్‌రూమ్‌ లైట్‌ విధానంతో బాత్‌రూమ్‌లో అడుగుపెట్టగానే లైట్‌ వెలగటం, బయటకు రాగానే లైట్‌ ఆగేలా ప్రణయ్‌ ఏర్పాటు చేశాడు. అలాగే స్ట్రీట్‌ లైట్లు చీకటి పడగానే వెలగటం, వెలుతురు రాగానే ఆగిపోవటం వంటి విధానాన్ని రూపొందించాడు. దీంతో పాటు వైఫై కార్‌, వాయిస్‌ కంట్రోల్‌ కార్‌, అబ్‌స్టాకిల్‌ అవాయిడింగ్‌ రోబోట్‌, లైట్‌ డిపెన్‌డెంట్‌ రిజిష్టర్‌ తదితర ఆవిష్కరణలను చేశాడు.

రైటింగ్‌ మిషన్‌ అందించాలనే లక్ష్యం
రాయలేని వికలాంగులకు బ్లూ వాయిస్‌ సీఎన్‌సీ రైటింగ్‌ మిషన్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. రానున్న రోజుల్లో పాఠశాలల్లో, కళాశాలలో చదివి రాయలేని వికలాంగులకు ప్రభుత్వ సాయంతో మిషన్‌ను అందించాలని కృషి చేస్తున్నాను. మరిన్ని నూతన ఆవిష్కరణలతో ప్రజలకు ఉపయోగపడేలా పని చేయాలన్నదే నా కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేశాను.
– రాసంశెట్టి ప్రణయ్‌, మచిలీపట్నం

Advertisement
Advertisement