పేదల కళ్లల్లో ఆనందాల హరిఇల్లు | Sakshi
Sakshi News home page

పేదల కళ్లల్లో ఆనందాల హరిఇల్లు

Published Tue, May 30 2023 2:26 AM

- - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సీఆర్డీఏ పరిధి లోని అమరావతి ప్రాంతంలో నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరబోతోందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు అన్నారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను చూసి లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. సీఆర్డీఏ పరిధిలోని అమరావతిలో ఆర్‌–5 జోన్‌లో ఇళ్ల స్థలాలు మంజూరైన లబ్ధిదారులకు సోమవారం నిడమర్రు లేఅవుట్‌లో కలెక్టర్‌ ఢిల్లీరావు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్థన్‌ పట్టాలను పంపిణీ చేశారు. తొలుత సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన 2,924 మంది లబ్ధిదారులను 100 బస్సుల్లో లే అవుట్‌ వేసిన నిడమర్రు గ్రామానికి తరలించారు. బీఆర్‌ టీఎస్‌ రోడ్డులో కలెక్టర్‌ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అక్కడకు చేరుకుని లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను స్వయంగా చూపించారు. నిడమర్రు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ.. సీఆర్డీఏ ప్రాంతంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల స్థలాలు కేటాయించడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఆర్‌–5 జోన్‌లో 737 ఎకరాల విస్తీర్ణంలో 14 లేఅవుట్ల ద్వారా ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన సుమారు 27,031 మంది పేద మహిళలకు వారి పేరుతో పట్టాలు పంపిణీ చేస్తు న్నట్లు తెలిపారు. వారిలో సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన 2,924 మంది లబ్ధిదారులు ఉన్నారని, వీరికి కేటాయించిన భూమిని చూపించామని వివరించారు.

పారదర్శకంగా పట్టాల పంపిణీ

లబ్ధిదారులకు కేటాయించిన భూముల్లో జియో ట్యాగింగ్‌ చేసి పారదర్శకంగా పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. మంగళవారం మరో 6,700 మంది, 31వ తేదీన నాలుగు వేల మంది లబ్ధిదారులకు వారికి కేటాయించిన భూములను చూపించి పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లో స్థలాలు మంజూరైన ప్రతి ఒక్కరికీ పట్టాలను పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. లేఅవుట్లలో రహదారులను అభి వృద్ధి చేయడంతో పాటు లబ్ధిదారులకు అవసర మైన తాగునీరు, విద్యుత్‌, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులను కల్పిస్తామని కలెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. నగరంలో సొంత ఇల్లు లేక, ఇంటి అద్దె చెల్లించ లేని పరిస్థితుల్లో అనేక కుటుంబాలు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వారి ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి నిరుపేద అక్కచెల్లెమ్మలకు రాజధాని ప్రాంతంలో స్థలాలను కేటాయించారని పేర్కొన్నారు. స్థలాల కేటాయింపుతో పేదల సొంత ఇంటి కల నెరవేరబోతోందన్నారు. నిరుపేదలను అన్ని విధాల ఆదుకోవాలనే దృక్పథంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రస్థానాన నిలిచారని కొనియాడారు. సీఆర్డీఏ పరిధిలో లక్షలాది రూపాయల విలువగల భూములను పేదలకు కేటాయించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధాన్యవాదాలు తెలిపారు. డెప్యూటీ మేయర్‌ అవుతూ శ్రీ శైలజారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, తహసీల్దార్‌ సీహెచ్‌.దుర్గాప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

నిడమర్రు లే అవుట్‌లో

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

Advertisement
Advertisement