మేం సిద్ధం.. మీరు సిద్ధమా? | Sakshi
Sakshi News home page

మేం సిద్ధం.. మీరు సిద్ధమా?

Published Wed, Nov 15 2023 12:50 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగన్‌మోహనరావు, చిత్రంలో ఎమ్మెల్సీ అరుణకుమార్‌  - Sakshi

నందిగామ టౌన్‌: తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు నేటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయని.. ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడింది ఎవరనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసని శాసన సభ్యుడు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహనరావు పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శాసన మండలి సభ్యుడు డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌తో కలిసి మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అడిగిన మాదిరిగా సత్యమ్మ అమ్మవారి ఆలయంలోనే కాదు టీడీపీ నేతలు ఏ ఆలయంలో అంటే ఆ ఆలయంలో, మసీదులో, చర్చిలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతికీ పాల్పడలేదని మీరు ప్రమాణం చేయగలరా అని సూటిగా ప్రశ్నించారు.

ఆరోపణలు నిరూపించాలి

వసూల్‌ బ్రదర్స్‌, రౌడీ బ్రదర్స్‌ అని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతున్నారని, తాము ఎవరి వద్ద వసూళ్లు చేస్తున్నాం.. రౌడీయిజం చేసి ఎవరిని బెదిరిస్తున్నామో నిరూపించాలని జగన్‌ మోహనరావు డిమాండ్‌ చేశారు. రాజకీయాలు చేయాలి కాని దిగజారుడు రాజకీయాలు చేయకూ డదని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫెర్రీ వద్ద కృష్ణానదిలో బోటు బోల్తాపడి పదుల సంఖ్యలో మృత్యువాత పడితే నీటి ప్రవాహానికి ఇసుక కొట్టుకువచ్చి గుంతలు పడ్డాయని ఎత్తు పల్లాలు అర్థం కాకపోవటంతో బోటు బోల్తాపడిందని చెప్పారని గుర్తు చేశారు. కానీ వారు ప్రతిపక్షంలోకి వచ్చాక మునేటిలో, కృష్ణానదిలో మునిగి మృతి చెందితే మాత్రం అధికార పార్టీ నాయకుల ఇసుక తవ్వకాలతోనే మృత్యువాత పడుతున్నారని మాట్లాడటం సిగ్గుచేటని జగన్‌మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ఇప్పటి వరకు ఓపికతో, సహనంతో భరించామని ఇకపై సహించేది లేదని శాసన మండలి సభ్యుడు డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌ స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ మహ్మద్‌ మస్తాన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణ కన్వీనర్‌ దొంతిరెడ్డి దేవేందర్‌ రెడ్డి, నాయకులు గుడివాడ సాంబశివరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.

టీడీపీ నాయకుల ఆరోపణలపై ఎమ్మెల్యే జగన్‌మోహనరావు సవాల్‌

Advertisement
Advertisement