హంసలదీవికి అభివృద్ధి హారం | Sakshi
Sakshi News home page

హంసలదీవికి అభివృద్ధి హారం

Published Thu, Nov 23 2023 1:42 AM

- - Sakshi

కోడూరు(అవనిగడ్డ): కృష్ణానది సముద్రంలో కలిసే పుణ్యక్షేత్రమైన హంసలదీవి సాగరతీరాన్ని రూ.25కోట్లతో అభివృద్ధి చేస్తామని బందరు పార్లమెంట్‌ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఎన్టీపీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.65లక్షల నిధులతో కోడూరు 8,9 వార్డుల్లో నూతనంగా నిర్మిస్తున్న మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుతో కలిసి బాలశౌరి బుధవారం శంకుస్థాపన చేశారు. సచివాలయాల మండల కన్వీనర్‌ కడవకొల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో బాలశౌరి మాట్లాడారు. మహాబలేశ్వరంలో జన్మించిన కృష్ణమ్మ అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి హంసలదీవి క్షేత్రం వద్ద సముద్రంలో కలుస్తుందని, ఈ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని బాలశౌరి అన్నారు. హంసలదీవి క్షేత్రం గురించి ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడామని, త్వరలోనే ఈ క్షేత్రం అభివృద్ధికి రూ.25కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయిస్తానన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్‌..

అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించనున్నట్లు బాలశౌరి తెలిపారు. ఇప్పటికే చల్లపల్లిలోని రామానగరంలో రూ.65లక్షలు, అవనిగడ్డలో మరో రూ.65లక్షలతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. త్వరలోనే మోపిదేవిలోని పెదకళ్లేపల్లిలో రూ.1.20కోట్లు, నాగాయలంకలోని ఎదురుమొండిలో రూ.65లక్షలతో భవన నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. వీటితో పాటు కోడూరు, నాగాయలంక మండలాల్లో అదనంగా రెండు కల్యాణ మండపాలను కూడా నిర్మిస్తామని ఎంపీ చెప్పారు.

మత్స్యకారుల అభ్యున్నతికి రూ.4కోట్లు..

మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.4కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తున్నట్లు బాలశౌరి తెలిపారు. మత్స్యకారులు జీవనస్థితి మెరుగు పడాల్సిన అవసరం ఉందని, వీరికి అవసరమైన జెట్లు, ఫ్లాట్‌ఫారంలు, వలలు వంటి సామగ్రి కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ నిధులు త్వరలోనే విడుదలవుతాయన్నారు. మూడు నియోజకవర్గాల్లోని మత్స్యకారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నిధుల వినియోగంపై చర్చించనున్నట్లు చెప్పారు. ముందుగా రాజ్యంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి బాలశౌరి, రమేష్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమ్యూనిటీ హాల్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమి పూజలో పాల్గొన్నారు. దివి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొక్కిలిగడ్డ వీరవెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ యాదవరెడ్డి వెంకటసత్యనారాయణ, ఎంపీపీ కొండవీటి వెంకటకుమారి, సర్పంచి వెన్నా షైనీ, వైఎస్సార్‌ పాల్గొన్నారు.

రూ.25కోట్లతో పనుల నిర్వహణ బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి

Advertisement
Advertisement