ఇంద్రకీలాద్రిపై రూ. 216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన | AP CM YS Jagan Laid The Foundation Stone For Works Worth Rs. 216 Crore At Durga Temple Development Works- Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై రూ. 216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

Published Thu, Dec 7 2023 1:16 AM

- - Sakshi

Updates

9:13AM, Dec 7 , 2023

  • రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌
  • రూ. 57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ. 30 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం
  • రూ. 27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం
  • రూ. 13 కోట్లతో ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌
  • రూ. 15 కోట్లతో రాజగోపారం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం
  • రూ.  23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్‌
  • రూ. 7. 75 కోట్లతో కనకదుర్గానగర్‌ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం
  • రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద  క్యూ కాంప్లెక్స్‌ మార్పు
  • రూ. 19 కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం
  • రూ. 10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ  సముదాయంగా మార్పు

9:01AM, Dec 07, 2023

  • ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌

8:35AM, Dec 07, 2023

  • విజయవాడకు బయల్దేరిన సీఎం జగన్‌
  • దుర్గగుడిపై పలు ప్రారంభోత్సవాలు, శంకస్థాపనలు చేయనున్న సీఎం జగన్‌
  • అనంతరం కనకదుర్గమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్‌

రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకస్థాపనలు

కనకదుర్గ గుడి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. అందులో భాగంగా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. గురువారం ఈ మాస్టర్‌ ప్లాన్‌లోని రూ. 216.05కోట్ల విలువైన పలు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన మల్లేశ్వరాలయంతో పాటు పలు ఆలయాలను ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవాలు ఇవే..
ప్రభుత్వ నిధులు రూ.5.60 లక్షలతో చేపట్టిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్‌టీ ప్యానల్‌ బోర్డులు, ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌, స్కాడా పనులు పూర్తయ్యాయి. దుర్గగుడి అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.70 కోట్ల నుంచి ఈ పనులు చేపట్టారు. వీటిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దేవదాయ శాఖ నిధులు రూ. 3.87 కోట్లతో చేపట్టిన 8 ఆలయాల పునఃనిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా ఆలయాలను కూడా ప్రారంభించనున్నారు. అలాగే పాతపాడు గ్రామంలోని ఆలయానికి చెందిన స్థలంలో దేవస్థాన నిధులు రూ. 5.66 కోట్లతో ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ కేంద్రం, కొండ దిగువన రూ. 23 లక్షలతో బొడ్డు బొమ్మ, అమ్మవారి పాత మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, వినాయక స్వామి ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది.

శంకుస్థాపనలు ఇలా..
దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అమ్మవారి అన్నప్రసాద భవనం రూ.30 కోట్లు, అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనం రూ. 27 కోట్లతో నిర్మించనున్నారు. వీటితో పాటు దేవస్థాన నిధులు రూ.13 కోట్లతో కనకదుర్గనగర్‌ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్‌ క్యూకాంప్లెక్స్‌, రూ.23.50 కోట్లతో రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, రూ.7.75 కోట్లతో కనకదుర్గనగర్‌ ప్రవేశ ద్వారం వద్ద మహారాజ ద్వారం నిర్మాణం, రూ.7 కోట్లతో కొండపైన పూజా మండపం, రూ.18.30 కోట్లతో మల్లికార్జున మహామండపం క్యూకాంప్లెక్స్‌ నిర్మాణం, రూ.19 కోట్లతో నూతన కేశఖండనశాల, రూ.10 కోట్లతో గోశాల వద్ద బహుళ ప్రయోజన సౌకర్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇవే కాకుండా దాతలు సహకారంతో అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మార్గంలో రూ.5 కోట్లతో గ్రానైట్‌ రాతి యాగశాల, దేవస్థానం, ప్రయివేటు భాగస్వామ్యంతో రూ.33 కోట్ల వెచ్చించి కనకదుర్గనగర్‌లో మల్టీలెవల్‌ కారు పార్కింగ్‌ నిర్మాణం జరుగుతుంది. ఈ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 8.35గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి, 8.45 గంటలకు విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకుంటారు. అక్కడ పలు పనులను ప్రారంభిస్తారు. 9.05 నుంచి 9.25 గంటల మధ్య కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 9.25 గంటలకు తిరిగి బయలుదేరి 9.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. మహా మండపం దిగువన శంకుస్థాపన కోసం చేస్తున్న ఏర్పాట్లను దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో కేఎస్‌ రామారావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.216 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావడంతో వాటిని ప్రారంభిస్తారని చెప్పారు. దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌, డీసీపీ విశాల్‌గున్ని, ఆలయ ఈఈలు కోటేశ్వరరావు, ఎల్‌.రమాదేవి, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement