కార్తికేయునిసన్నిధిలో ప్రముఖులు | Sakshi
Sakshi News home page

కార్తికేయునిసన్నిధిలో ప్రముఖులు

Published Sun, Dec 10 2023 2:10 AM

- - Sakshi

మోపిదేవి(అవనిగడ్డ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆర్టీఏ రాష్ట్ర కమిషనర్‌ హరిప్రసాద్‌రెడ్డి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులతో వేర్వేరుగా శనివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయ ఏసీ ఎన్‌.ఎస్‌.చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వారు పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ, మణిదీప్‌ శర్మ, ప్రసాద్‌ శర్మ, విరూప్‌ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్‌ బొప్పన సత్యనారాయణ స్వామివారి లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. తహసీల్దార్‌ కె. నవీన్‌కుమార్‌, వీఆర్వో మూర్తి, ఆలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మాస్టర్‌ అథ్లెటిక్స్‌ రాష్ట్ర పోటీల్లో జిల్లాకు 29 పతకాలు

విజయవాడస్పోర్ట్స్‌: మాస్టర్‌ అథ్లెటిక్స్‌ 42వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా మాస్టర్‌ అథ్లెట్స్‌ శనివారం 29 పతకాలు కై వసం చేసుకున్నట్లు కృష్ణాజిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.వి.ప్రసాదరావు తెలిపారు. ఈ నెల 8వ తేదీన తిరుపతిలో ప్రారంభమైన ఈ పోటీలు 10వ తేదీ ఆదివారం ముగుస్తాయన్నారు. రెండో రోజు శని వారం సాయంత్రానికి రన్నింగ్‌, హ్యామర్‌త్రో, స్విమ్మింగ్‌, హర్డిల్స్‌ తదితర విభాగాల్లో జిల్లా అథ్లెట్లు పతకాలు సాధించినట్లు చెప్పారు. ఆదివారం కొనసాగే పోటీల్లో జిల్లాకు మరికొన్ని పతకాలు దక్కే అవకాశం ఉందన్నారు.

15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలతో బాధపడుతున్న 15 మంది చిన్నారులకు విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేసినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ పి.వి.రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్సల వివరాలు వెల్లడించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, ఆంధ్రా మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రస్ట్‌, హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌–యూకే చారిటీ సహకారంతో ఈ నెల నాలుగు నుంచి తొమ్మిదో తేదీ వరకూ ప్రత్యేక శిబిరం నిర్వహించి 15 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్నారు. ఈ చికిత్స లను యూకేకు చెందిన డాక్టర్‌ సెర్బన్‌, డాక్టర్‌ రవీంద్ర, పిడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌ సౌమ్య, ఆక్టావియా, లీనాలతో పాటు, ఆంధ్రా హాస్పిటల్‌ గుండె సర్జన్‌ డాక్టర్‌ దిలీప్‌ చేశారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం.బి.వి.ప్రసాద్‌ సహకారం అందించారని తెలిపారు. ఇప్పటి వరకూ తమ ఆస్పత్రిలో 2015 నుంచి 3,600 చిన్నారులకు గుండె సర్జరీలు చేశామన్నారు. ఈ సమావేశంలో చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జె.శ్రీమన్నారాయణ, పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ కె.విక్రమ్‌, డాక్టర్‌ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement