మాకొద్దు బాబోయ్‌! | Sakshi
Sakshi News home page

మాకొద్దు బాబోయ్‌!

Published Tue, Dec 12 2023 2:02 AM

-

సాక్షి ప్రతినిధి, విజయవాడ: పామర్రు నియోజకవర్గంలో ‘తమ్ముళ్లు’ బరితెగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడినని, పార్టీ సీనియర్‌ నేతనని చెప్పుకుంటున్న వర్ల రామయ్య ఒకవైపు.. ఇకపై నియోజకవర్గ భవిష్యత్తు తానేనని వల్లె వేస్తున్న ఆయన కుమారుడు వర్ల కుమార్‌రాజా మరోవైపు అధికారం లేకుండానే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2014–19 టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు తాము చెప్పిందే వేదం అన్న రీతిలో రామయ్య వ్యవహరించారని ఇప్పుడు తండ్రికి మించిన రీతిలో వేధింపులు, వసూళ్లకు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పామర్రు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా వర్ల కుమార్‌రాజా పోటీ చేయకముందే బ్లాక్‌ మెయిల్‌, డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో టీడీపీ క్యాడర్‌ సైతం ఆయనకు దూరంగా ఉంటున్నారు.

మార్చండి మహా ప్రభో..

ప్రస్తుతం గ్రామాల్లో రైతులు చెరువుల్లో మట్టి తోలుకొంటూ ఉంటే, ఆ ఫొటోలు తీసి, డబ్బులు డిమాండ్‌ చేయడం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈయనను భరించడం కష్టమని భావించిన టీడీపీలోని ఓ వర్గం నేతలు ఇన్‌చార్జిని మార్చండి మహా ప్రభో అంటూ చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఇతనికి ప్రత్యామ్నాయంగా ఓ మాజీ ఎమ్మెల్యేను తెరపైకి తీసుకువచ్చినట్టు సమాచారం. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సైతం పామర్రు నియోజకవర్గంలో క్యాడర్‌నుగాని, నియోజకవర్గ అభివృద్ధిని వర్ల రామయ్య పట్టించుకోలేదని గతాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీని అడ్డు పెట్టుకొని విజయవాడ వన్‌టౌన్‌లో ఏకంగా ఓ కొండను తవ్వి, 200 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో బెల్‌ కంపెనీ కాంట్రాక్టర్‌ను డబ్బులివ్వాలని బెదిరించడంతో, కంపెనీ వారు ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. విజయవాడ–మచిలీపట్నం హైవే నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. గ్రామాల్లో చెరువుల్లో మట్టి డబ్బు వసూలు, కాంట్రాక్టు పనులకు సంబంధించి పర్సంటేజీ వసూలు చేసినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పామర్రు బస్‌స్టేషన్‌ను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోటి రూపాయలతో బస్‌స్టేషన్‌ పనులు చేపట్టిన వైనాన్ని ప్రజలు చర్చించుకొంటున్నారు. పామర్రులో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా న్యాయ వివాదాలు సృష్టించిన విషయాన్ని ప్రజలు తలచుకొంటున్నారు. మొత్తం మీద నియోజక వర్గంలో సామాన్య ప్రజలు మొదలు, సొంత పార్టీ క్యాడర్‌, టీడీపీ నేతలు సైతం ఈ తండ్రీకొడుకులు మాకొద్దు బాబోయ్‌ అని వేడుకుంటున్నారు.

పామర్రులో.. వర్ల కుటుంబంపై సర్వత్రా వ్యతిరేకత టీడీపీ అధిష్టానానికి ఓ వర్గం ఫిర్యాదు సామాన్యులపైనా రామయ్య కుటుంబం బెదిరింపుల పర్వం

Advertisement

తప్పక చదవండి

Advertisement