జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

Published Wed, Dec 13 2023 4:40 AM

జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి   - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడారంగానికీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని టీచర్స్‌ ఎమ్మెల్సీ టి.కల్పలత రెడ్డి అన్నారు. అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ 67వ జాతీయ బ్యాడ్మింటన్‌ బాలబాలికల పోటీల ప్రారంభోత్సవం విజయవాడలోని పీబీ సిద్ధార్థ అర్ట్స్‌,సైన్స్‌ కాలేజీ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌తో కలిసి ఆమె ఈ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. విద్యారంగ సంస్కరణలు అమలు చేయడంతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ‘ఆడుదాం.. ఆంధ్రా’ క్రీడోత్సవాలను నిర్వహించనుందని తెలిపారు. బ్యాడ్మింటన్‌ జాతీయ టోర్నీకి విజయవాడ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలుగు నేలపై నుంచి పుల్లెల గోపీచంద్‌, సైనా నెహ్వాల్‌, పి.వి.సింధు భారతీయ క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు.

మూడు జాతీయ టోర్నీల నిర్వహణకు అవకాశం

ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు మాట్లాడుతూ.. భారతీయ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌కు మూడు జాతీయస్థాయి టోర్నీల నిర్వహణకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రస్తుత అండర్‌–19 బ్యాడ్మింటన్‌ టోర్నీతోపాటు త్వరలో కాకినాడలో అండర్‌–19 టెన్నిస్‌, రాజంపేటలో అండర్‌–14 బాలికల కబడ్డీ టోర్నీలు జరుగుతాయని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అవసరమైన నిధులను మంజూరు చేస్తోందన్నారు. 44,998 పాఠశాలలకు స్పోర్ట్స్‌ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసిందని గుర్తు చేశారు. అండర్‌–19 బ్యాడ్మింటన్‌ బాలబాలికల టోర్నీ ఈ నెల 16 వరకు పటమట సీహెచ్‌ఆర్‌కే ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుందన్నారు. 33 రాష్ట్రాల నుంచి 325 మంది క్రీడాకారులు ఈ టోర్నీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్‌జీఎఫ్‌ఐ, ఎస్‌జీఎఫ్‌ ఏపీ, కళాశాల పతాకాలను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, జాతీయ పతాకాన్ని కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆవిష్కరించారు. టోర్నీ జాతీయ అబ్జర్వర్‌ రాజు రాణా, కన్వీనర్‌ సి.శివసత్యనారాయణరెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.రవికాంత, ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సహాయ కార్యదర్శి కె.వి.రాధాకృష్ణ, పీబీ సిద్ధార్థ జూనియన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పటమటలోని చెన్నుపాటి రామ కోటయ్య ఇండోర్‌ స్టేడియంలో టీం చాంపియన్‌ షిప్‌ లీగ్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి.

మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల క్రీడాకారులు
1/1

మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల క్రీడాకారులు

Advertisement
Advertisement