కృష్ణా వర్సిటీ స్విమ్మింగ్‌ జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

కృష్ణా వర్సిటీ స్విమ్మింగ్‌ జట్ల ఎంపిక

Published Wed, Dec 20 2023 1:48 AM

- - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: సౌత్‌వెస్ట్‌ జోన్‌ అంతర విశ్వవిద్యాలయాల స్విమ్మింగ్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా యూనివర్సిటీ మహిళలు, పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు ఎంపిక కమిటీ చైర్‌పర్సన్‌, సప్తగిరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.డి.శ్రీదేవి మంగళవారం తెలిపారు. ఇటీవల తమ కళాశాల ఆధ్వర్యంలోనే యూనివర్సిటీ అంతర కళాశాలల స్విమ్మింగ్‌ పోటీలను నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులను యూనివర్సిటీ జట్లకు ఎంపిక చేశామన్నారు. పురుషుల జట్టుకు బి.బాలగంగా ధర్‌, పి.శరణ్‌చౌదరి, ఎండీ పర్వేజ్‌మహరూప్‌, ఎం.హర్షవర్ధన్‌, కార్తికేయ, మహిళల జట్టుకు డి.మానస, వి.శృతిశిరీష ఎంపికయ్యారని వివరించారు. జట్ల ఎంపిక కమిటీ మేనేజర్‌గా డాక్టర్‌ ఆర్‌.రఘురామ్‌, సభ్యులుగా డాక్టర్‌ డి.యుగంధర్‌, డాక్టర్‌ బి.సి.హెచ్‌.సంగీతరావు వ్యవహరించారని తెలిపారు.

మోపిదేవి ఆలయంలోమహా పూర్ణాహుతి

మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహా పూర్ణాహుతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయ ఏసీ ఎన్‌.ఎస్‌.చక్రధరరావు ఆధ్వర్యంలో ప్రాతఃకాలార్చన, గోపూజ, నిత్య హోమం, బలిహరణ, పంచామృత స్నపన, వసంతోత్సవం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 11 గంటలకు శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు, రాత్రి ఏడు గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి పుష్ప శయ్యాలంకృత పర్యంకసేవ జరిగాయి. వేదపండితుడు కొమ్మూరి ఫణికుమార్‌ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్‌ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

బాడీబిల్డింగ్‌ పోటీల్లో సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు

పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఈ నెల 17వ తేదీన అనకాపల్లిలో జరిగిన మిస్టర్‌ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారని జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తాళ్లూరి అశోక్‌ తెలిపారు. 65 కిలోల విభాగంలో కె.బాలకృష్ణ, 80 కిలోల విభాగంలో ఆర్‌.గోనీకృష్ణ, 85 కిలోల విభాగంలో ఎన్‌.గిరీష్‌, 90 కిలోల విభాగంలో ఎస్‌.ఉదయ్‌ కుమార్‌ బంగారు పతకాలు, 85 కిలోల విభా గంలో జి.సతీష్‌కుమార్‌ రజతం, అబ్దుల్‌ ఆసీఫ్‌ కాంస్య పతకం సాధించారని, 55 కిలోల విభాగంలో ఎండీ జాఫర్‌ సాదిక్‌ ఐదో స్థానంలో నిలిచాడని వివరించారు. కానూరు అశోక్‌ జిమ్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను గన్నవరం సర్కిల్‌ డీఎస్పీ జయసూర్య, డీఎస్పీ కె.ధర్మేంద్ర మంగళవారం అభినందించారు. పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు, ఎస్‌ఐ రమేష్‌, అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ఈదా రాజేష్‌, అధ్యక్షుడు మనోహర్‌, నాగేశ్వరరావు, రాజు, సాజిత్‌ పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్‌ పోటీల్లో సోనికాసాయికి కాంస్యం

విజయవాడ స్పోర్ట్స్‌: జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో విజయవాడ క్రీడాకారిణి పరసా సోనికాసాయి సత్తా చాటింది. అసోంలోని గువా హటిలో ఈ నెల 18వ తేదీ ప్రారంభమైన చాంపియన్‌షిప్‌ పోటీలకు ఇండియన్‌ రైల్వేస్‌ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అసోం క్రీడాకారిణిపై 3–0 తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సోనికా ప్రస్తుతం విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయంలోని ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది.

1/3

2/3

3/3

Advertisement
Advertisement