వైభవోపేతం.. అహోబిలేశుడి బ్రహ్మోత్సవం | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 4 2023 5:22 AM

మాడ వీధుల్లో శేషవాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు   - Sakshi

ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఐదో రోజైన గురువారం శ్రీ ప్రహ్లాదవరదుడు ఉభయ దేవరులతో శేషవాహనం అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగారు. అంతకు ముందు సుప్రభాత సేవతో మూలవిరాట్‌ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను మేలుకొలిపారు. దివ్య దర్శనం అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పట్టు వస్త్రాలతో అలంకరించారు. వివిధ రకాల స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీదుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాభిషేకం, జలాభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదవరదుడు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఎగువ అహోబిలంలో..

ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి గురువారం శరభ వాహనం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అనంతరం ఉత్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి యాగశాలలో కొలువుంచారు. రాత్రి శ్రీ జ్వాల నరసింహస్వామిని శరభ వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

శేషవాహనంపై ఉభయ దేవేరులతో ప్రహ్లాదవరదుడు

శేష, చంద్రప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన

ఽప్రహ్లాదవరదుడు

శర ప్రభ వాహనంపై ఊరేగిన

శ్రీ జ్వాలా నరసింహుడు

Advertisement
Advertisement