విస్తృతంగా జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే | Sakshi
Sakshi News home page

విస్తృతంగా జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే

Published Wed, Sep 20 2023 2:20 AM

- - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 29వ తేదీ వరకు సాగుతుంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరికై నా అనారోగ్యం ఉంటే వారి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్‌ అందజేస్తున్నారు. ఈ టోకెన్‌ తీసుకుని ఈ నెల 30వ తేదీ నుంచి జరిగే వైద్యశిబిరాల్లో పాల్గొని చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. వైద్యశిబిరంలో అవసరమైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి, స్పెషలిస్టు వైద్యులచే చికిత్స చేసి మందులు అందజేస్తారని చెబుతున్నారు. ఈ వైద్యుల పరిధిలోకి రాని వ్యాధులు ఏవైనా ఉంటే అలాంటి వారిని గుర్తించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తారని సూచిస్తున్నారు. ఈ మేరకు సర్వే జరుగుతున్న తీరును జిల్లా ప్రొగ్రామ్‌ అధికారులు మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ వై. ప్రవీణ్‌కుమార్‌ గార్గేయపురం గ్రామంలో కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశాలకు తగు సూచనలు అందజేశారు. ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. వైద్యశిబిరంలో ఏడురకాల పరీక్షలు(బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌, మలేరియా, డెంగీ, యూరిన్‌, గళ్ల పరీక్ష) నిర్వహిస్తారని, వాటి ఫలితాల ఆధారంగా మందులు అందజేస్తారన్నారు. అలాగే నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దిన్నెదేవరపాడు గ్రామంలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్‌లను పంపిణీ చేశారు. ఈ టోకెన్‌లను తీసుకుని వైద్యశిబిరానికి వస్తే వైద్యపరీక్షలు నిర్వహించి నిపుణులైన వైద్యులచే చికిత్స అందించి మందులు అందజేస్తారని ఆమె సూచించారు.

Advertisement
Advertisement