మిర్చి మిలమిల! | Sakshi
Sakshi News home page

మిర్చి మిలమిల!

Published Thu, Sep 21 2023 2:04 AM

ఆలూరు మండలం హులేబిడులో సాగు చేసిన మిరప - Sakshi

పశ్చిమ ప్రాంతంలో పెరుగుతున్న ఎర్రబంగారం సాగు
● జల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 49,660 ఎకరాలు మాత్రమే ● ఈ క్రాప్‌ ప్రకారం ఇప్పటికే 1,26,913 ఎకరాలకు పైగా సాగు.. ● ధరలు ఆశాజనకంగా ఉండటంతో పంటపై రైతుల ఆసక్తి ● దిగుబడి సగటున ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ● ఉమ్మడి జిల్లాలో పెరిగిన మార్కెటింగ్‌ సదుపాయం
ఎండుమిర్చి సాగు అంటే గుంటూరు జిల్లా గుర్తుకు వచ్చేది. ఇప్పుడు ఆ జిల్లాను మించి కర్నూలు జిల్లాలో ఎర్రబంగారం సాగు అవుతుంది. ప్రస్తుతం తెగుళ్ల ప్రభావం పెద్దగా లేకపోవడం.. మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతో రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 49,660 ఎకరాలు కాగా ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా సాగు కావడం విశేషం.

కర్నూలు(అగ్రికల్చర్‌): గతంలో మిర్చి సాగుపై విమర్శలు ఉన్నాయి. బీమా కోసం రైతులు మిర్చి సాగు చేసినట్లు చూపుతారనే అభిప్రాయం ఉండేది. ఈ అభిప్రాయం తప్పని గత ఏడాదే నిరూపణ అయింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కూడా రికార్డు స్థాయిలో ఎండు మిర్చి సాగువుతుంది. ప్రస్తుతం జిల్లాలో మిరప నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ–క్రాప్‌ ప్రకారమే 1,26,913 ఎకరాల్లో మిరప సాగు అయినట్లు తెలుస్తోంది. 68వేల మందికిపైగా రైతులు ఈ పంట సాగులో రాణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వేరుశనగ, ఉల్లి, టమాట, పత్తి రైతులు మిర్చి పంటల వైపు దృష్టి సారించడంతో సాగు పెరుగుతుంది. పశ్చిమ ప్రాంతమైన ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని నియోజక వర్గాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని వివిధ మండలాల్లో ఎటు చూసినా మిరప పంటే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మిరప నారుమళ్లు పోశారు.

పెరిగిన మార్కెటింగ్‌ సదుపాయం

గతంలో మిర్చి అమ్ముకోవడానికి కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మాత్రమే అవకాశం ఉండేది. కర్నూలు మార్కెట్‌కు రెండో రకం నాణ్యత కలిగిన మిర్చి ఎక్కువగా వస్తుంది. మంచి నాణ్యత కలిగినది గుంటూరు మార్కెట్‌కు వెలుతోంది. మిర్చి పంటను అమ్ముకోవడంలో రైతులు పడుతున్న ఇక్కట్లను గుర్తించిన ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయాన్ని వారికి మరింత దగ్గర చేసింది. కొత్తగా నంద్యాలలో కూడా మిర్చి యార్డును ప్రారంభించడం రైతులకు కలిసి వచ్చింది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోనే ఈ యార్డు నడుస్తుంది.

రికార్డు స్థాయి ధర

పలుకుతున్న ఎండుమిర్చి

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎండుమిర్చి క్రయవిక్రయాలు కూడా ఈ–నామ్‌ విధానంలోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే ఎండుమిర్చి క్రయవిక్రయాలకు గుంటూరు ప్రసిద్ధి గాంచింది. అక్కడి మిర్చి యార్డుతో పోలిస్తే కర్నూలు మార్కెట్‌కు వచ్చే మిర్చి నాణ్యత అంతగా ఉండదు. కాని ధరలు పతాకస్థాయిలో లభించడం విశేషం. 2022–23లో కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు 37, 929 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. క్వింటాలుకు గరిష్టంగా రూ. 50వేలకు పైగా ధర లభించింది. ధరలు జోరు మీద ఉండటంతో రైతులు మిర్చి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మిర్చిలో అధిక దిగుబడి పొందాలంటే సాగునీటి సదుపాయం అవసరం. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) వివిధ మండలాల మీదుగా వెళ్లడం, తుంగభద్ర నది కూడా పలు మండలాల మీదుగా ప్రవహిస్తుండటం బాగా కలసి వచ్చింది. దీనికితోడు నాలుగేళ్లుగా వర్షాలు విస్తారంగా పడుతుండటంతో బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇదిలా ఉంటే వర్షాధారం కింద మిర్చి సాగు చేసిన రైతులు పంట బెట్టకు గురి కాకుండా రక్షక నీటి తడులు ఇచ్చే ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్య సదుపాయం కూడా కల్పిస్తోంది. 2022–23 నుంచి సూక్ష్మ సేద్యం మిర్చికే ఎక్కువగా ఇస్తుండటం విశేషం.

ఎకరాకు సగటు దిగుబడి 25 క్వింటాళ్లు!

సుగంధ ద్రవ్యాల పంటగా ఎండుమిర్చిని వ్యవహరిస్తారు. ఈ పంట సాగులో పెట్టుబడి వ్యయం కూడా ఎక్కువగానే ఉంటోంది. ఎకరాకు సరిపోయే నారు రూ.15 వేల వరకు ధర పలుకుతోంది. రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, బాడుగలు ఎకరాకు పెట్టుబడి రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వస్తుంది. ఉద్యాన శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఎకరాకు ఎండుమిర్చి సగటు దిగుబడి 25 క్వింటాళ్ల వరకు ఉంటుంది. రైతులు అవగాహనతో సాగు చేస్తే ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లు ఆపై కూడా వచ్చే అవకాశం ఉంది.

రికార్డు స్థాయిలో ఎండుమిర్చి సాగు

ఈ ఏడాది జిల్లాలో ఎండుమిర్చి రికార్డు స్థాయిలో సాగు అవుతోంది. ప్రస్తుతం మిర్చి నాట్లు వేసుకోవడం చురుగ్గా జరుగుతోంది. ఈ–క్రాప్‌ నమోదు ప్రకారం ఇప్పటి వరకు 1,26,913 ఎకరాలు మిర్చి సాగు అయింది. ఈ–క్రాప్‌ ఈ నెల చివరి వరకు జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే సాగు విస్తీర్ణం 1.60 లక్షల ఎకరాల వరకు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది 1.26 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అయింది. ఎండుమిర్చి ధర ఆశాజనకంగా ఉండటం, దిగుబడులు మెరుగ్గా ఉండటమే పంట సాగు పెరగడానికి కారణం. మిర్చికి ప్రభుత్వం ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మ సేద్యం సదుపాయం కూడా కల్పిస్తోంది. – పి.రామంజనేయులు,

జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు

విరగ్గాసిన పూత
1/2

విరగ్గాసిన పూత

2/2

Advertisement
Advertisement