ప్రతి రైతుకు ఈ–క్రాప్‌ బుకింగ్‌ రసీదులు | Sakshi
Sakshi News home page

ప్రతి రైతుకు ఈ–క్రాప్‌ బుకింగ్‌ రసీదులు

Published Thu, Nov 9 2023 1:12 AM

మద్దికెర మండలంలో రైతులకు అందించిన రసీదులు - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): 2023–24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్‌ బుకింగ్‌ రసీదుల జారీకి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. 10,17,374 ఎకరాల్లో సాగు చేసిన పంటలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. అయితే 9,73,650 ఎకరాలకు సంబంధించి 3,25,851 మంది ఈ–కేవైసీ ద్వారా సాగు చేసిన పంటలను ధృవీకరించారు. ప్రతి రైతు మొబైల్‌ ఫోన్‌కు నమోదు చేసిన పంటలకు సంబంధించిన వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియపరుస్తున్నారు. పంటలను ఈ–క్రాప్‌లో నమోదు చేసిన తర్వాత వాటిని ధృవీకరిస్తూ ఈ–కేవైసీ పూర్తయ్యాక రైతులకు రసీదులు జారీ చేస్తున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద నోటిఫై చేయబడిన పంటలకు ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి తద్వారా పంటల బీమా చేయబడిందని స్పష్టంగా పేర్కొనడం విశేషం.

టపాసులు అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు

కర్నూలు: బాణసంచా విక్రయదారులు నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ హెచ్చరించారు. దీపావళి పర్వదినాన టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సూచించిన బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. నీరు, ఇసుక, అగ్నిమాపక సామగ్రి టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లైసెన్స్‌ కలిగిన దుకాణాదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా డయల్‌ 100కు సమాచారం అందించాలని, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

రిటైర్డ్‌ డీఆర్వో

సూర్యప్రకాష్‌ మృతి

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు జిల్లాలో ఆర్‌డీఓ, డీఆర్వో, జెడ్పీ సీఈఓ, డీఆర్‌డీఏ, డ్వామా పీడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన సూర్యప్రకాష్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని ఉప్పునేసిపల్లె. పదవీ విరమణ తరువాత ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. అంత్యక్రియలు గురువారం సొంతూరులోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎస్పీ కృష్ణకాంత్‌
1/1

ఎస్పీ కృష్ణకాంత్‌

Advertisement
Advertisement