ఈవీఎంల ప్రథమ స్థాయి పరిశీలన పూర్తి | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ప్రథమ స్థాయి పరిశీలన పూర్తి

Published Thu, Nov 9 2023 1:12 AM

బెల్‌ ఇంజినీర్లను సన్మానించిన కలెక్టర్‌ మనజీర్‌   - Sakshi

నంద్యాల: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన పూర్తయిందని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌లో ఈవీఎంల భద్రత గోడౌన్లో జరుగుతున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన (ఎఫ్‌ఎల్‌సీ) చివరి ఘట్టాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్లకు సంబంధించి ఎఫ్‌ఎల్‌సీ కార్యక్రమాన్ని బెల్‌ ఇంజినీర్లు, రెవెన్యూ, ఇతర సిబ్బంది నిర్వహించారన్నారు. ఇందులో పార్లమెంట్‌కు సంబంధించి 2030 కంట్రోల్‌ యూనిట్లు, 2509 బ్యాలెట్‌ యూనిట్లు, 2452 వీవీ ప్యాట్లు మొదటి దఫా పరిశీలన పూర్తిచేసుకుని ఓటింగ్‌ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 1,924 కంట్రోల్‌ యూనిట్లు, 2,520 బ్యాలెట్‌ యూనిట్లు, 2,451 వీవీ ప్యాట్లు మొదటి దఫా పరిశీలన పూర్తిచేసుకుని ఓటింగ్‌ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈవీఎంల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌కు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరయారన్నారు. గత నెల 16వ తేదీ ప్రారంభమైన ఈవీఎంల మొదటి దఫా పరిశీలన ఘట్టం బుధవారంతో ముగిసిందన్నారు. గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంల నిఘా నిమిత్తం సెక్యూరిటీ గార్డ్స్‌ కోసం నిర్మిస్తున్న షెల్టర్‌ను పరిశీలించారు. ఈవీఎంల ఫస్ట్‌ లెవెల్‌ చెక్‌ విజయవంతంగా పూర్తి చేసినందుకు 14 మంది బెల్‌ ఇంజినీర్లను, నోడల్‌ అధికారి, ఎఫ్‌ఎల్‌సీ సూపర్‌వైజర్‌ సుబ్బారెడ్డిని కలెక్టర్‌ సన్మానించారు.

Advertisement
Advertisement