50వేల ఖాతాలు ప్రారంభిద్దాం | Sakshi
Sakshi News home page

50వేల ఖాతాలు ప్రారంభిద్దాం

Published Tue, Nov 14 2023 1:54 AM

సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ 
ఎస్వీ విజయమనోహరి 
 - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): రాబోయే రెండు నెలల్లో ఇంటింటికీ వెళ్లి ఖాతాలు ప్రారంభించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్‌పర్సన్‌ ఎస్వీ విజయమనోహరి తెలిపారు. సేవింగ్‌, కరంట్‌ ఖాతాలు కనీసం 50వేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బ్రాంచ్‌ మేనేజర్లతో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. డోన్‌, పత్తికొండ, కృష్ణానగర్‌, ఆదోని, ఆలూరు బ్రాంచ్‌ల్లో బకాయిలు ఎక్కువగా ఉన్నాయని, రికవరీపై దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సొంత నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. కొత్తగా సహకార సమృద్ధి డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నామని, ఇది నెల రోజులు మాత్రమే అమలులో ఉంటుందన్నారు. 456 రోజుల కాలపరిమితితో చేసే డిపాజిట్‌లపై సీనియర్‌ సిజిటన్‌లకు 8.2 శాతం, ఇతరులకు 7.70 శాతం వడ్డీ లభిస్తుందన్నారు. సమావేశంలో సీఈఓ రామాంజనేయులు, నంద్యాల రీజినల్‌ మేనేజర్‌ శివలీల, డీజీఎంలు ఉమమహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్‌, నాగిరెడ్డి, ఆప్కాబ్‌ డీజీఎం దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement