Sakshi News home page

144 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లకు స్థానాల కేటాయింపు

Published Thu, Nov 16 2023 6:27 AM

- - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు 144 మంది సాంకేతిక సహాయకుల(టీఏ)కు కౌన్సెలింగ్‌ ద్వారా మండలాలు కేటాయించారు. కొద్ది నెలల క్రితం రేషనలైజేషన్‌లో భాగంగా టెక్నికల్‌ అసిసెంట్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లారు. వీరు తిరిగి ఉమ్మడి జిల్లాకు వచ్చారు. బుధవారం కౌన్సిలింగ్‌ ద్వారా మండలాలు కేటాయించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ అమరనాథరెడ్డి నేతృత్వంలోని కమిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్‌డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ సలీమ్‌బాషా, డ్వామా పరిపాలన అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఈసీకి పంచాయతీల వివరాలు

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల వివరాలను పంపుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి టీ నాగరాజునాయుడు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మజరా గ్రామాలు, రెవెన్యూ గ్రామాల వారీగా పూర్తి వివరాలను పంపించాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎస్‌ఈసీ కోరిన విధంగా అన్ని గ్రామ పంచాయతీల వివరాలను పంపుతున్నట్లు డీపీఓ తెలిపారు.

40 శాతం సబ్సిడీపై వేరుశనగ పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీలో నీటి ఆధారంపై సాగుకు 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లాకు 2,150 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ధరలు, సబ్సిడీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాసెసింగ్‌, సంచి, ప్యాకింగ్‌, ఆర్‌బీకేలకు సరఫరా సహా క్వింటా పూర్తి ధర రూ.10వేలుగా నిర్ణయించింది. ఇందులో 40 శాతం అంటే రూ.4వేల సబ్సిడీ ఉంటుంది. రబీలో వేరుశనగను కర్నూలు, నందవరం, ఆస్పరి మండలాలకు మినహా మిగిలిన అన్ని మండలాలకు నీటి వసతిని బట్టి వేరుశనగను కేటాయించారు.

సీడాఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(వీఏఎస్‌) డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌కు రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టు లభించింది. పశుసంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌గా ఈయన మంత్రాలయంలో నాలుగేళ్లు పనిచేశారు. తొమ్మిదేళ్ల పాటు కర్నూలు జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో టెక్నికల్‌ వీఏఎస్‌గా ఉన్నారు. 15 నెలలుగా విజయవాడలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేషీలో అడి షినల్‌గా సేవలందిస్తున్నారు. తాజాగా ఈయనను ప్రభుత్వం కీలకమైన సొసైటీ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఆంధ్రప్రదేశ్‌( ఎస్‌ఈఈడి ఏపీ– సీడాప్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. విజయవాడలోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా విధులు నిర్వహిస్తారు.

గ్రంథాలయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

కర్నూలు కల్చరల్‌: గ్రంథాలయాల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని డీఆర్‌ఓ కె.మధుసూదనరావు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో నిర్వహిస్తున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం పుస్తక ప్రదర్శన, పురాతన నాణేల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనను ప్రారంభించిన డీఆర్‌ఓ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తక పఠనం జీవిత మార్గదర్శనానికి ఎంతో ఉపయుక్తమన్నారు. విద్యార్థుఽలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పెద్దక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత లైబ్రేరియన్‌ రంగనాథ్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్లు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement