ఆడుదాం– ఆంధ్రాకు సై | Sakshi
Sakshi News home page

ఆడుదాం– ఆంధ్రాకు సై

Published Thu, Dec 14 2023 1:16 AM

క్రీడా పరికరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ (ఫైల్‌) - Sakshi

రేపటి నుంచి వచ్చేనెల

26 వరకు క్రీడాపోటీలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

గోస్పాడు: ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆడుదాం–ఆంధ్ర పేరుతో ప్రభుత్వం నిర్వహించనున్న క్రీడాపోటీలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 15 నుంచి వచ్చే నెల (2024 జనవరి) 26 వరకు క్రీడా సంబరాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జరగనున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

గ్రామ, వార్డు స్థాయి నుంచి పోటీలు

వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇవే కాకుండా క్రీడాకారులు ఆసక్తి చూపిస్తే యోగ, టెన్నికాయిట్‌, 3–కే, మారథాన్‌ గ్రామీణ సంప్రదాయ క్రీడలను నిర్వహిస్తారు. ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి, 21 నుంచి జనవరి 4 వరకు మండల, 5 నుంచి 10 వరకు నియోజకవర్గ, 11 నుంచి 21 వరకు జిల్లా, 22 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా కాంపిటేషన్‌లో పాల్గొనేందుకు 54,553 మంది, నాన్‌కాంపిటేటివ్స్‌లో పాల్గొనేందుకు 34,492 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాకు అందిన క్రీడా పరికరాలు..

బేసిక్‌ క్రికెట్‌ కిట్టు మెన్‌ 1,032, సర్టిఫికెట్స్‌ 2,394, బేసిక్‌ క్రికెట్‌ కిట్టు ఉమెన్‌ 516, బ్యాడ్మింటన్‌ నైలాన్‌ నెట్లు 516, వాలీబాల్‌ నెట్‌ 516, మెడల్స్‌ 2,394, ట్రోఫీలు 216, నైలాన్‌ షటిల్‌ కాక్స్‌ 1,548, ఫెదర్‌ షటిల్‌కాక్‌ 340, స్టేజ్‌–1 బ్యాడ్మింటన్‌ రాకెట్స్‌ 3,096, ఖోఖో యాంక్లెట్స్‌ 875, కబడ్డీ నీక్యాప్స్‌ 875, స్టేజ్‌–2 బ్యాడ్మింటన్‌ రాకెట్స్‌ 224, స్టేజ్‌–2 వాలీబాల్స్‌ 112, స్టేజ్‌–1 వాలీబాల్స్‌ 1,548, టెన్నికాయిట్స్‌ 1,032, స్టేజ్‌–2 ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కిట్టు మెన్‌ 56, ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కిట్టు 28, క్రికెట్‌ లెదర్‌ బాల్స్‌ 68 అందినట్లు అధికారులు తెలిపారు.

పేరు నమోదు చేసుకున్నా

15 ఏళ్లు పైబడిన వారికి కూడా పోటీలలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంతో నేను కూడా ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించలేదు. ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటం సంతోషకరం.

– ప్రసాద్‌, క్రీడాకారుడు,

జిల్లెల్ల గ్రామం, గోస్పాడు(మం)

ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆడుదాం – ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేశాం. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఆట స్థలాల పరిశీలన పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా సంబరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేస్తాం – ఎంఎన్‌వీ రాజు,

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, నంద్యాల

Advertisement
Advertisement