ఏపీజీఎల్‌ఐ ఏడీగా గౌరి ప్రసన్న | Sakshi
Sakshi News home page

ఏపీజీఎల్‌ఐ ఏడీగా గౌరి ప్రసన్న

Published Sat, Dec 23 2023 5:04 AM

రుత్విక (ఫైల్‌) - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్‌ఐ) కర్నూలు జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం అసిస్టెంటు డైరెక్టర్‌గా ఎన్‌.గౌరి ప్రసన్నను నియమిస్తూ ఏపీజీఎల్‌ఐ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరిలోని ఏపీజీఎల్‌ఐ డైరెక్టరేట్‌లో సూపరింటెండెంటుగా పనిచేస్తున్న గౌరిప్రసన్నకు అసిస్టెంటు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేశారు. ఇంతవరకు ఇక్కడ ఏడీగా పనిచేసిన వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఏడీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ నియామకం జరిగింది. రెండు, మూడు రోజుల్లో ఈమె బాధ్యతలు స్వీకరిస్తారు.

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో శుక్రవారం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్‌ లో ఐదో సెమిస్టర్‌ పరీక్షకు 10,937 మందికి గాను 10,053 మంది, మధ్యాహ్నం సెషన్‌లో మొదటి సెమిస్టర్‌ పరీక్షకు 11,272 మందికి గాను 10,324 మంది హాజరయ్యారు. చూచిరాతలకు పాల్పడిన ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాల, హనుమాపురం నలంద డిగ్రీ కళాశాల, కర్నూలు సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు విద్యార్థులు డిబార్‌ చేశామని డీన్‌ ఆచార్య నాగస్వరం నరసింహులు తెలిపారు.

పాముకాటుతో చిన్నారి మృతి

కృష్ణగిరి: పాము కాటు గురై చిన్నారి మృతి చెందిన ఘటన పెద్దొడ్డి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన రవికుమార్‌కు ఆలంకొండ గ్రామానికి చెందిన గీతాంజలికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కూమార్తె రుత్విక ఉంది. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో రాత్రి ఆరున్నర గంటల సమయంలో చిన్నారి ఆడుకుంటూ గోడ దగ్గరకు వెళ్లి ఏడవడంతో తల్లి వెళ్లి చూడగా చిన్నారికి కాలికి రక్తం చుక్కలు రావడాన్ని గమనించి భర్తకు తెలిపింది. వెంటనే ఆతను టార్చిలైట్‌ వేయగా రెండు పాములు కనిపించాయి. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వగా రెండు నాగు పాములను చంపారు. వెంటనే చిన్నారిని 108లో కర్నూలుకు తరలిస్తుండగా వెల్దుర్తి దగ్గరకు వచ్చేసరికి చిన్నారి మృతి చెందింది.

Advertisement
Advertisement