పల్లె చెంతకు కృష్ణమ్మ | Sakshi
Sakshi News home page

పల్లె చెంతకు కృష్ణమ్మ

Published Sat, Jan 6 2024 1:50 AM

కొలిమిగుండ్ల మోడల్‌ స్కూల్‌ సమీపంలో 
నిర్మించిన గ్రౌండ్‌ లెవల్‌ సంప్‌  - Sakshi

అవుకు సీపీడబ్ల్యూస్కీం

మూడో ఫేజ్‌ పనులు పూర్తి

తొమ్మిది గ్రామాల మంచినీటి

సమస్యకు శాశ్వత పరిష్కారం

త్వరలో ట్రయల్‌ రన్‌

సంక్రాంతికి ప్రారంభోత్సవం

కొలిమిగుండ్ల: అవుకు రిజర్వాయర్‌లోని కృష్ణా జలాలతో పల్లె ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీపీడబ్ల్యూస్కీం మూడో ఫేజ్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలో తొమ్మిది గ్రామాల ప్రజల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది. కొలిమిగుండ్ల మండలంలో నాపరాతి గనులతో పాటు వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోయి తరచూ తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. ఈ గ్రామాల ప్రజలకు శాశ్వత మంచి సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నెలకొన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. అవుకు రిజర్వాయర్‌ సీపీడబ్లూస్కీం మూడో ఫేజ్‌ కింద కొలిమిగుండ్ల మండలంలో బెలుం శింగవరం, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, రాఘవరాజుపల్లె, అంకిరెడ్డిపల్లె, తుమ్మలపెంట, చింతలాయిపల్లె, తిమ్మనాయినపేట, బందార్లపల్లె గ్రామాలకు పైపులైన్‌ ద్వారా నీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం రూ.8.5 కోట్ల నిధులు విడుదల చేపింది. ప్రస్తుతం పనులన్నీ పూర్తి కావడంతో జనవరి మొదటి వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొలిమిగుండ్ల మోడల్‌ స్కూల్‌ సమీపంలో 2.5 లక్షల నీటి సామర్థ్యం ఉన్న గ్రౌండ్‌ లెవల్‌ సంప్‌లో నీటిని నింపి సిద్ధంగా ఉంచారు. ట్రయల్‌ రన్‌ అనంతరం సంక్రాంతికి ఈస్కీంను ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈస్కీం పరిధిలో ఇప్పటి వరకు మూడు ఫేజ్‌ల్లో రూ.36.50 కోట్లతో కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని 56 గ్రామాలకు రోజుకు 90 లక్షల నీటిని అవుకు రిజర్వాయర్‌ నుంచి ఫిల్టర్‌ చేసి నీటి సరఫరా చేస్తున్నారు.

అన్ని పనులు పూర్తి

సీపీడబ్లూస్కీం మూడో ఫేజ్‌కు సంబంధించి అన్ని పనులు పూర్తి చేశాం. త్వరలోనే ట్రయల్‌రన్‌ చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పైపులైన్‌ ఎక్కడా లీకేజీ కాకుండా కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేశాం. ఈస్కీం ప్రారంభమైతే 9 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కానుంది.

– ఉమాకాంతరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement