పర్యావరణ స్పృహ కలిగి ఉండాలి | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 10:04 PM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: సమాజంలో ప్రతి ఒక్కరు పర్యావరణ స్పృహను కలిగి ఉండాలని కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య టి. శ్రీనివాస్‌రావు అన్నారు. కేయూ సెనేట్‌హాల్‌లో సోమవారం జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలు క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య బి.సురేష్‌లాల్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైన్స్‌ సమాజానికి ఒకదానికి ఒకటి ముడిపడి ఉందన్నారు. భారతదేశం సైంటిఫిక్‌ రంగంలో గ్లోబల్‌హబ్‌గా మారుతుందన్నారు. ప్రపంచ దేశాలన్ని కూడా మనదేశంవైపు చూస్తున్నాయన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త విశ్రాంత ఆచార్యులు కె.పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ కాలుష్య మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి మనం చేయాల్సిన బాధ్యత చాలా ఉందన్నారు. వాతావరణ మార్పు, గ్లోబల్‌ వార్మింగ్‌ ,అంతరించిపోతున్న జంతుసంపద, జీవవైవిధ్యం మాయమవుతున్న చెరువులు, గుట్టలు, నీటిపై యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త సీనియర్‌ ఐఐసీటి ఆచార్యులు వేణుగోపాల్‌మాట్లాడుతూ ఓజోన్‌ లేయర్‌పై కర్బాన్‌ ఉద్ఘారాల ప్రభావం చాలా ఉందన్నారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. సమావేశంలో సైన్స్‌డీన్‌ ఆచార్య పి.మల్లారెడ్డి, కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్‌ సవితాజ్యోత్న్స ,కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌ ఆచార్య ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, అడ్జెంట్‌ ప్రొఫెసర్‌ గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల, యూనివర్సిటీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య శ్రీనివాస్‌రావు

Advertisement
Advertisement