రేలకుంటలో గొర్రెల చోరీ | Sakshi
Sakshi News home page

రేలకుంటలో గొర్రెల చోరీ

Published Mon, Mar 27 2023 1:24 AM

-

నల్లబెల్లి: వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలోని రేలకుంటలో గొర్రెల చోరీ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నందిగామ, రేలకుంట గ్రామాలకు చెందిన చిట్టె రవి, అమ్మ కుమార్‌, చిట్టె కొంరయ్య, బాలు నాయక్‌లు గొర్రెలను పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, ఉగాది రోజున రేలకుంట శివారులో వారు మంద ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో నిద్రపోయారు. ఈ క్రమంలో సమీప మొక్కజొన్న చేనులో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ మాటుగాచారు. గొర్రెల కాలప ఉన్నవారు నిద్రమత్తులో ఉండగా అదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు మందలోకి చొరబడి 8 గొర్రెలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై అజ్మీరా సురేష్‌ నాయక్‌ తెలిపారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

విద్యారణ్యపురి: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌, సుదర్శనం ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈమేరకు ఈనెల 28న హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని తెలిపారు. వివిధ రకాల బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ–కుబేర్‌లో ఉన్న బిల్లులను ఈనెల 31వరకు విడుదల చేయాలని తెలిపారు.

Advertisement
Advertisement