కలెక్టరేట్‌ ముట్టడి | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడి

Published Sat, Apr 1 2023 1:26 AM

హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న నాయకులు - Sakshi

హన్మకొండ/ వరంగల్‌ రూరల్‌: పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, వర్గీకరణకు చట్టబద్దత కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హనుమకొండ, వరంగల్‌ కలెక్టరేట్లను ముట్టడించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్పటికే కలెక్టరేట్‌ గేట్లు మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీగా వచ్చిన ఎమ్మార్పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాను విరమించుకోవాలని పోలీసులు కోరినా మొదట్లో వినిపించుకోలేదు. ఎమ్మార్పీఎస్‌, ఎమ్మె స్పీ నాయకుల బృందాన్ని తీసుకెళ్లి జిల్లా రెవెన్యూ అధికారి వాసుచంద్ర, వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీవత్సకోటకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంద కుమార్‌ మాదిగ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి 9 సంవత్సరాలు అవుతున్న కార్యరూపం ఇవ్వకుండా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. వచ్చే సాధారణ ఎన్నికల లోపు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని, దీనిపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. లేని ఎడల ఏప్రిల్‌ 3న బీజేపీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల ముట్టడిని చేపడుతామని, 4న రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల జాతీయ రహదారులు ముట్టడిస్తామన్నారు. ఎమ్మెస్పీ జిల్లా కన్వీనర్‌ గంగారం శ్రీనివాస్‌, జన్ను దినేష్‌, సుకుమార్‌, మంద రాజు, ఏకు శంకర్‌ , ముఖేష్‌, నారాయణ మాదిగ, భిక్షపతి మాదిగ, సదయ్య మాదిగ, వెంకటస్వామి మాదిగ, శనిగరపు రవీందర్‌ మాదిగ, మధుకర్‌, సూర్యం, శాంతిసాగర్‌, మహేష్‌, సాంబరాజు, భాగ్య, స్వరూప, విమల ఎమ్మెస్పీ వరంగల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ బిర్రు మహేందర్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా కన్వీనర్‌ కట్ల రాజశేఖ ర్‌ మాదిగ, ఎమ్మెస్పీ నర్సంపే ట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రణయ్‌దీప్‌, విజయ్‌మాదిగ, ఈర్ల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీగా చేరుకున్న ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నాయకులు, కార్యకర్తలు

కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు యత్నం

అడ్డుకున్న పోలీసులు

Advertisement
Advertisement