సర్వేయర్‌పై బదిలీ వేటు | Sakshi
Sakshi News home page

సర్వేయర్‌పై బదిలీ వేటు

Published Thu, Nov 9 2023 1:54 AM

- - Sakshi

మహబూబాబాద్‌: మానుకోట తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే అధికారులు వరుసగా బదిలీ అవుతున్నారు. భూ సమస్యల్లో తలదూర్చడం, కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు బదిలీలు జరుగుతున్నాయని తీవ్ర చర్చ. జిల్లా కేంద్రంలో అధికారికంగా వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండాలి. కాగా చాలా వరకు కబ్జాకు గురికావడంతో భూ సమస్యలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో కబ్జాదారులకు సహకరిస్తున్నారనే నెపంతో ఇటీవల ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేయగా.. ఈ నెల 7న సర్వేయర్‌ను డిప్యుటేషన్‌పై గూడూరుకు పంపించారు.

ఇటీవల ఇద్దరు తహసీల్దార్లు..

మానుకోట తహసీల్దార్‌గా ఇమ్మానీయేల్‌ ఆరు నెలలు మాత్రమే పనిచేశారు. ఈక్రమంలో ఆయనను గత నెలలో బయ్యారం మండలానికి బదిలీ చేశారు. బయ్యారంలో పని చేసిన భగవాన్‌రెడ్డి మానుకోటకు వచ్చారు. అంతకంటే ముందు నాగభవాని మానుకోట తహసీల్దార్‌గా 14 నెలలు విధులు నిర్వర్తించారు. ఆమెను ఎలాంటి కారణాలు చెప్పకుండానే కలెక్టరేట్‌కు అటాచ్‌ చేసి ఆ తర్వాత డోర్నకల్‌ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. ఇలా ఇద్దరు తహసీల్దార్ల విషయంలో ఎలాంటి కారణాలు చెప్పకుండా బదిలీ చేయడంపై తీవ్ర చర్చ.

సర్వేయర్‌ సంజీవ బదిలీ..

సర్వేయర్‌ భూక్య సంజీవను గూడూరుకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తూ కలెక్టరేట్‌ నుంచి ఈనెల 7న సాయంత్రం ఉత్తర్వులు వచ్చాయి. గూడూరు సర్వేయర్‌ భాస్కర్‌ను మానుకోటకు బదిలీ చేశారు. కాగా సంజీవపై భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా తనపై పని ఒత్తిడి ఉందని కలెక్టర్‌కు చేసిన విజ్ఞప్తి మేరకు ట్రాన్స్‌ఫర్‌ చేశారని సర్వేయర్‌ సంజీవ చెబుతున్నారు. ఎన్నికల అనంతరం మళ్లీ మానుకోటకే వస్తానని సమాధానం ఇవ్వడం గమనార్హం.

చెరువులు, శిఖం భూముల కబ్జా..

మానుకోట పట్టణం, శివారులో చెరువులు, శిఖం భూములు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. శిఖం భూమి పక్కనే కొంత పట్టాభూమి ఉంటే మొత్తం కలుపుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేసి కోట్లు దండుకుంటున్నారు. వారికి కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. నాలా అనుమతులు, భూసమస్యలు రెవెన్యూ అధికారులు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలా డబ్బులకు ఆశపడిన అధి కారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే నెపంతోనే రెవెన్యూశాఖలో వరుసగా బదిలీలు జరుగుతున్నాయని మానుకోటలో తీవ్ర చర్చ సాగుతోంది.

ఇటీవల మానుకోటలో తహసీల్దార్ల స్థానచలనం

వరుస ఘటనలతో తీవ్ర చర్చ

భూ సమస్యల వల్లే

ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నట్లు సమాచారం

Advertisement
Advertisement