పరకాలకు సీఎం.. వరంగల్‌కు రాహుల్‌ | Sakshi
Sakshi News home page

పరకాలకు సీఎం.. వరంగల్‌కు రాహుల్‌

Published Fri, Nov 17 2023 1:20 AM

సీఎం సభాస్థలి ఏర్పాట్లు పరిశీలిస్తున్న 
సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా - Sakshi

పరకాల/వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌, ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. పరకాల–రాజీపేట శివారులోని వెల్లంపల్లి రోడ్డులో గల 10 ఎకరాల భూమిలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్ష మంది సభకు వస్తారనే అంచనాతో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యవేక్షణలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4గంటలకు జరిగే సభకు సీఎం కేసీఆర్‌ చేరుకుంటారు. సభాస్థలికి 300 మీటర్ల దూరంలోనే హెలిపాడ్‌ ఏర్పాట్లు చేశారు.

సభాస్థలిని

పరిశీలించిన సీపీ

వరంగల్‌ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సీఎం సభాస్థలితో పాటు హెలిపాడ్‌ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. బందోబస్తు గురించి పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. 1 డీసీపీ, 4 ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్సైలతో సహా కానిస్టేబుల్స్‌, గ్రేహౌండ్‌ పోలీసులు మొత్తం 300 మందితో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నర్సంపేట, వరంగల్‌లో రాహుల్‌

ఏఐసీసీ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ శుక్రవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా పినపాక నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 1.55 గంటలకు నర్సంపేటకు చేరుకుంటారు. నర్సంపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పాల్గొంటారు. మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సంపేట నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 3.25 గంటలకు మామునూరులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. 3.40 గంటలకు వాహనంలో వరంగల్‌ హెడ్‌పోస్టాఫీస్‌ వద్దకు చేరుకుని అక్కడి నుంచి వరంగల్‌ చౌరస్తా మీదుగా పోచమ్మ మైదాన్‌ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. అక్కడ కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడతారు. పాదయాత్ర, కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ సుమారు 80 నిమిషాలు గడపనున్నారు. ఎంజీఎం జంక్షన్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం వాహనంలో మామునూరుకు చేరుకుని సాయంత్రం 5.15 గంటలకు హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తారని అధికారులు విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

నేడు ప్రజాఆశీర్వాద సభలో ప్రసంగించనున్న కేసీఆర్‌

నర్సంపేటలో రాహుల్‌గాంధీ

భారీ బహిరంగ సభ,

వరంగల్‌ తూర్పులో పాదయాత్ర,

కార్నర్‌ మీటింగ్‌

పోలీసుల పటిష్ట బందోబస్తు

1/2

2/2

Advertisement
Advertisement