ఉత్తుత్తి జంప్‌! | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తి జంప్‌!

Published Mon, Nov 20 2023 1:08 AM

- - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండడంతో ద్వితీయశ్రేణి నాయకులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో నాయకులు పార్టీ మారుతున్నట్లు ముందుగా పుకార్లు పుట్టిస్తున్నారు. తర్వాత అనుచరుల ద్వారా అభ్యర్థులకు తెలిసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. విషయం తెలిసిన సదరు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుజ్జగింపులు, బేరసారాలు జరిపి పార్టీలోనే ఉండేలా చూస్తున్నారు. దీంతో స్టోరీకి ఎండ్‌కార్డు పడుతోంది. కాగా ద్వితీయశ్రేణి నాయకుల డబుల్‌ గేమ్‌ అర్థంకాక కొందరు.. అర్థం చేసుకున్నా.. దానిని వ్యతిరేకించలేని పరిస్థితి ఉండడంతో అంతా మనస్సులో పెట్టుకొని బతిమిలాడాల్సిన పరిస్థితి అభ్యర్థులకు దాపురించింది.

పుకార్లు షికారు..

చొక్కాలు మార్చినంత ఈజీగా పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారని ప్రచారం. మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని గూడూరు, నెల్లికుదురు మండలాలతో పాటు మహబూబాబాద్‌ పట్టణం, డోర్నకల్‌ నియోజకర్గంలోని కురవి, డోర్నకల్‌ మండలాలకు చెందిన కొందరు నాయకులు పార్టీలు మారుతున్నామని ప్రచారం చేశారు. ఈ విషయం ఆ నోట..ఈ నోట ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలిసింది. అసలే పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరితో ఎలాంటి నష్టం జరుగుతుందోనని సదరు అభ్యర్థులు తమ అనుచరులు, కుటుంబ సభ్యులను రాయబారానికి పంపించినట్లు తెలిసింది. పార్టీ మారవద్దని హితోపదేశం చేశారు. ఇప్పుడు గుర్తుకు వచ్చానా.. నాకు గుర్తింపులేదని ఒక పార్టీకి చెందిన నాయకుడు అంటే.. కొత్తవారు రావడంతో ఎప్పటి నుంచో పార్టీకోసం పనిచేసిన మముల్ని పట్టించుకోవడం లేదని మరొక పార్టీకి చెందిన నాయకుడు అలిగినట్లు ప్రచారం. దీంతో వారిని నచ్చజెప్పడం, బుజ్జగించడం, పార్టీ మారవద్దని చెప్పి వెళ్లినట్లు తెలిసింది.

బేరసారాలు..

పార్టీలు మారాలని భావించే నాయకులను బుజ్జగించడంతో పాటు బేరసారాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు నియోకవర్గాల్లోని ఓ పార్టీ నాయకుల అసంతృప్తిని మరోపార్టీ అభ్యర్థులు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వీరిలో అధిక సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేసే వారు ఉండడంతో సదరు పార్టీలకు చెందిన నాయకులు ముందస్తుగా అలర్ట్‌ అయ్యారనే ప్రచారం. దీంతో ఆయా నాయకులకు తాము సర్దిచెప్పడమే కాకుండా.. రాష్ట్ర పార్టీకి చెందిన నాయకులతో కూడా మాట్లాడించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అసంతృప్త నాయకులకు అధిక మొత్తంలో డబ్బు, తాయిలాలు కూడా అందినట్లు ప్రచారం. దీంతో ఆయా నాయకులు పార్టీలు మారే ప్రచారం సద్దుమణిగింది.

పార్టీ మారుతున్నామని

ముందుగా పుకార్లు

అభ్యర్థులకు తెలిసేలా

నాయకుల వ్యవహార శైలి

బుజ్జగింపులు.. బేరసారాలతో సమాప్తం

Advertisement

తప్పక చదవండి

Advertisement