భార్య ఆత్మహత్య కేసులో భర్తకు జైలు శిక్ష

18 Mar, 2023 01:40 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం/మిడ్జిల్‌: భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన కేసులో భర్తకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే మిడ్జిల్‌ మండలం కంచన్‌పల్లి చెందిన మల్లెపోగు శీనయ్యకు పెద్ద ఆదిరాలకు చెందిన రాములమ్మకు 2001లో వివాహైంది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా.. 17ఏళ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని భర్త, అత్త గొడవపడేవారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్‌ 1న మళ్లీ భర్త గొడవ పడడంతో ఆయన ఎదుటే రాములమ్మ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. దీనిపై అప్పటి మిడ్జిల్‌ ఎస్‌ఐ రవి కేసు నమోదు చేశారు. ఈ కేసు శుక్రవారం కోర్టుకు రావడంతో మహబూబ్‌నగర్‌ అసిస్టెంట్‌ సెషన్‌కోర్టు న్యాయమూర్తి పద్మ శీనయ్యకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

భర్తపై కేసు నమోదు

అచ్చంపేట రూరల్‌: అదనపు కట్నం కావాలని వేధిస్తున్న భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ శుక్రవారం తెలిపారు. నడింపల్లికి చెందిన మల్లేష్‌తో అచ్చంపేట ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన ఈశ్వరమ్మతో నాలుగేళ్ల క్రితం వివాహామైంది. కొన్ని రోజుల నుంచి భర్తతో పాటు అత్తామామలు అదనపు కట్నం తీసుకరావాలని వేధించారు. శుక్రవారం ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

మహిళలు నిద్రిస్తుండగా..

బంగారు గొలుసుల అపహరణ

తాడూరు: మండలంలోని మేడిపూర్‌లో రెండు ఇళ్లలో శుక్రవారం చోరీ జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజమ్మ ఇంట్లో మెడలోని 5 తులాల బంగారు గొలుసు, అదే గ్రామంలో మరో ఇంట్లో యశోద మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మెడలోంచి గొలుసులు దొంగిలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు