బీజేపీని గద్దెదించేందుకు ఐక్య ఉద్యమాలు | Sakshi
Sakshi News home page

బీజేపీని గద్దెదించేందుకు ఐక్య ఉద్యమాలు

Published Wed, Mar 29 2023 1:16 AM

మాట్లాడుతున్న సీపీఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు విజ్జు కృష్ణన్‌  - Sakshi

వనపర్తి క్రైం: బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు విజ్జు కృష్ణన్‌ పిలుపునిచ్చారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు తలపెట్టిన జనచైతన్య యాత్ర మూడో రోజు వనపర్తి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజా పోరాటాలను కాలదన్నిన శ్రీలంక ప్రధానికి పట్టిన గతే మోదీకి పట్టడం ఖాయమన్నారు. కార్పొరేట్‌ వ్యవసాయం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్మిక చట్టాలను మోదీ మెడలు వంచి వెనక్కి నెట్టామన్నారు. కరోనా సమయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత కేరళ రాష్ట్రానిదని కొనియాడారు. అనేక వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను మరిపించి, గద్దెక్కిన కేంద్ర ప్రభుత్వం, నేడుహామీలు మరిచి మతతత్వ రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. నిత్యావసర ధరలతో పాటు.. చమురు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోనుభారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ ఉద్యోగంలోనూ కాంట్రాక్టు వ్యవస్థ తీసుకురావడం అత్యంత దుర్మార్గమన్నారు. పెట్టుబడి 50 శాతం అదనంగా కలిపి ధర నిర్ణయిస్తే ఆశాజనకమైన గిట్టుబాటు ధర వచ్చేదని, ఆ నివేదికను బుట్టదాఖలు చేసి నల్లచట్టాలు తెచ్చి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను కూడగట్టిన శ్రామికులు, కార్మికుల వద్ద పైసలు లేకుండా పోయాయని, డబ్బంతా ఆదాని, అంబానీల వద్ద కూడుకుందని అన్నారు. కేరళలో 20 లక్షల మందికి పింఛన్లు , 4 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని అన్నారు. యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ, వెంకటరాములు, వెంకటస్వామి, భూపాల్‌, అరుణ, జ్యోతి, ధర్మనాయక్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు విజ్జు కృష్ణన్‌

Advertisement
Advertisement