నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలి | Sakshi
Sakshi News home page

నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలి

Published Sun, Apr 9 2023 1:40 AM

హాజీపూర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులు  - Sakshi

అచ్చంపేట రూరల్‌: అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని నిఖితది ముమ్మాటికీ హత్యనేనని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజు, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, మోపతయ్య అన్నారు. శనివారం అచ్చంపేట మండలంలోని హాజీపూర్‌ చౌరస్తా శ్రీశైలం– హైదరాబాద్‌ హైవేపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని, నిఖిత మృతికి కారకులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిఖిత చనిపోయి నెలరోజులు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళిత అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయలేని ప్రజాప్రతినిధులు ఉన్నా.. లేకున్నా ఒకటే అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో నిర్వహించే అచ్చంపేట దిగ్భంధంను జయప్రదం చేయాలని కోరారు. కాగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రహదారిపై వాహనాలు నిలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలను దారి మళ్లించి వివిధ రూట్లలో పంపించారు. కార్యక్రమంలో నాయకులు కాశీం, శ్రీనివాసులు, వెంకటేష్‌, నాసరయ్య, అంబయ్య, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement