చంద్రబాబుకి దక్కని ఊరట | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి దక్కని ఊరట

Published Fri, Nov 10 2023 5:08 AM

- - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించలేదు. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్‌ గురువారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించబోతుండగా.. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ జోక్యం చేసుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు దీపావళి సెలవుల తర్వాత వెలువడే అవకాశముందని లూథ్రానుద్దేశించి చెప్పారు. ఆ కేసులో తీర్పు వెలువడిన తర్వాతే ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసు విచారించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకి అక్టోబరు 30న ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు ఇచ్చిందని ఏపీ సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫైబర్‌నెట్‌ కేసు నవంబరు 23కు వాయిదా వేస్తామని ధర్మాసనం పేర్కొంది. అయితే, మరో తేదీన విచారణ చేపట్టాలని లూథ్రా విజ్ఞప్తి చేశారు. దీంతో నవంబరు 30కు ఫైబర్‌నెట్‌ కేసు విచారణ వాయిదా వేశారు. అప్పటివరకూ చంద్రబాబును అరెస్టుచేయకూడదని ఆదేశాలివ్వాలని లూథ్రా కోరారు. దీనిపై ఇప్పటికే ఒప్పందం ఉందిగా అని ఏపీ సీఐడీ తరఫు మరో సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ గుర్తుచేశారు. అనంతరం.. అక్టోబరు 30 వరకూ చంద్రబాబును అరెస్టు చేయరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే, ‘పిటిషనర్‌ దాఖలు చేసిన మరో పిటిషన్‌ ఉంది. దాంట్లో రిజర్వు చేసిన తీర్పు ఇదే ధర్మాసనం ఇవ్వాల్సి ఉంది. రెండింటికీ ముడిపడిన అంశాలున్నాయి. అందువల్ల ఈ కేసు నవంబరు 30కు జాబితా చేయాలని ఆదేశిస్తున్నాం’.. అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫైబర్‌నెట్‌ కేసులో సుప్రీంకోర్టు విచారణ సాగుతుండగా చంద్రబాబును అరెస్టుచేయబోమని ఏపీ సీఐడీ ధర్మాసనానికి ఇప్పటికే చెప్పిన విషయం విదితమే.

ఫైబర్‌నెట్‌ కేసు విచారణ 30కి వాయిదా

స్కిల్‌ కేసులో తీర్పు దీపావళి తర్వాతే నన్న సుప్రీంకోర్టు

Advertisement
Advertisement