ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

Published Thu, Nov 16 2023 1:30 AM

-

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 42 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 19 నామినేషన్లు చెల్లుబాటులో ఉండగా, మంగళ, బుధవారాలలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని.. దీంతో 15 మంది బరిలో ఉన్నట్లు పేర్కొన్నారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 మంది, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించేందుకు మొత్తం 835 పోలింగ్‌ కేంద్రాలతో పాటు, మూడు ఆక్సీలరీ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 272 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, మరో 3 ఆక్సీలరీ పోలింగ్‌ కేంద్రాలు ప్రతిపాదించామని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో 274, దేవరకద్ర నియోజకవర్గంలో 289 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఓటర్లు ఓటు వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

పక్కాగా బందోబస్తు..

పోలీస్‌ పెట్రోలింగ్‌, సీఏఎఫ్‌ బృందాల బందోబస్తు ఏర్పాటు చేశామని, మొదటి విడత రెండు కంపెనీల సీఏఎఫ్‌ బృందాలు జిల్లాకు వచ్చాయని, రెండోవిడత ఈ నెల 20న ఆరు కంపెనీల సీఏఎఫ్‌ బృందాలు రానున్నాయని ఎస్పీ హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. వీరందరూ ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేపడతారని పేర్కొన్నారు. అలాగే పోలింగ్‌ రోజు కర్ణాటక నుంచి మరో 750 మంది పోలీస్‌ఫోర్స్‌ వస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.3.55కోట్ల విలువైన నగదు, 2,600 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తు పక్కగా నిర్వహిస్తున్నామని, 1950 హెల్ప్‌లైన్‌తో పాటు, పోలీస్‌ కార్యాలయంలో కూడా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ జె.ఇస్రా పాల్గొన్నారు.

జిల్లాలో 7,07,698 మంది ఓటర్లు

మూడు నియోజకవర్గాల్లో 42 మంది పోటీ

835 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవినాయక్‌

Advertisement
Advertisement