మూడు నెలల్లోనే ప్రజావ్యతిరేకత | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లోనే ప్రజావ్యతిరేకత

Published Sat, Nov 18 2023 1:24 AM

మాట్లాడుతున్న రాఘవాచారి   - Sakshi

వనపర్తిటౌన్‌: బస్సులు, మార్కెట్‌ల నుంచి మొదలుకొని ఎక్కడ చూసిన ప్రభుత్వం మారిపోతుందని చెబుతున్నారని, మూడు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత బయటపడిందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నార్త్‌ తెలంగాణకు ఇస్తున్న ప్రాధాన్యత సౌత్‌కు ఇవ్వడం లేదని, రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి, రూ.20వేల కోట్లు పాలమూరుకు ఖర్చు పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టును 30 శాతం పనులు పూర్తి చేసి మొత్తం అయిపోయిందని సీఎం ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌కు నీళ్లు తేలేదు, పాత స్కీంలు పూర్తి చేయలేదు, ఆయకట్టు నిర్ధారించలేదన్నారు. గత ప్రభుత్వాల్లో లేని విధంగా ప్రస్తుత అభ్యర్థుల స్థిర, చర ఆదాయాలు విపరీతంగా పెరిగాయని, ఉద్యమ లక్ష్యం అభ్యర్థులు బలిసిపోవడమే అన్నట్లుగా మారిందన్నారు. మైనింగ్‌ను కూడా అభివృద్ధి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేసేవాళ్లకు వ్యాపారాలు ఎందుకని, వ్యాపారాలు చేసేవాళ్లు రాజకీయాల్లోకి రావొద్దన్నారు. సంక్షేమ పథకాలు యధాస్థితిని కొనసాగిస్తాయని, సంక్షేమ పఽథకాలు హక్కుగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉపా చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపా చట్టానికి బీజేపీ కోరలు తొడిగిందన్నారు. పాలమూరులోని నిర్వాసితులకు 2013 చట్టం వర్తించకపోవడంతో న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ, అమర్‌ రాజా కంపెనీలను ప్రోత్సహించేవారికి ఓట్లు వేయొద్దన్నారు. ఆ ఫ్యాక్టరీల్లోని కాలుష్యం కృష్ణతీరంలో కలవడంతో పశుపక్షాదులే కాకుండా ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో భద్రసేనయ్య, వెంకటేశ్వర్‌శెట్టి, యోసేపు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు అధ్యయన వేదిక

కన్వీనర్‌ రాఘవాచారి

Advertisement
Advertisement