ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

Published Sat, Dec 2 2023 1:04 AM

- - Sakshi

పాలమూరు: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, భవిష్యత్‌ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పోటీపడాలి తప్ప, తప్పుడు మార్గాల్లో వెళ్లి ప్రాణాంతక వ్యాధుల బారినపడరాదని, ప్రధానంగా హెచ్‌ఐవీ– ఎయిడ్స్‌ వంటి వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని జనరల్‌ ఆస్పత్రి సూపరింటెంటెంట్‌ జీవన్‌ అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా జనరల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ర్యాలీని సూపరింటెండెంట్‌ ప్రారంభించారు. అనంతరం లెక్చర్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుషులు, మహిళలు మంచి అలవాట్లతో జీవించాలని, ఇతరులకు ఆదర్శంగా ఉంటూ ఇతరులకు ఎయిడ్స్‌పై అవగాహన కలిగిస్తూ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో తెలియజెప్పాలన్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులను అవమానకరంగా చూడవద్దని, వారు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తే మరణశాతం తగ్గుతుందన్నారు. జిల్లా లో ఉన్న బాధితులకు అన్ని రకాల మందులు అందిస్తున్నట్లు చెప్పారు. హెచ్‌ఐవీ– ఎయిడ్స్‌ కేసులు తగ్గించడానికి ప్రతి గర్భిణికి పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు ముందుస్త చికిత్స అందించి శిశువులకు పాజిటివ్‌ రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైద్యులు రామకిషన్‌, లక్ష్మీపద్మప్రియ, సమత పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత

మహబూబ్‌నగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగం భవనం దగ్గర ఆదివారం భారీ పోలీస్‌ భద్రత ఏర్పాటు చేయనున్నారు. భవనం చుట్టూ మూడు అంచెల భద్రత విధానం పాటించనున్నారు. ప్రధానంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల దగ్గర నిఘా అధికంగా ఉండటంతోపాటు ప్రత్యేక బలగాలను రక్షణగా ఉంచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్రలకు సంబంధించిన ఫలితాలు ఒకే దగ్గర వెల్లడించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి యూనివర్సిటీపై ఉండటంతో పరిసర ప్రాంతాల్లో.. భవనం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా మొదటి రౌండ్‌ ఫలితాలు దాదాపు ఉదయం 10 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది.

నేడు ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ టోర్నీ, సెలక్షన్స్‌

జడ్చర్ల టౌన్‌: త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్‌–17 బాలుర ఫుట్‌బాల్‌ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక కోసం శనివారం బాదేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో శనివారం పోటీలు నిర్వహిస్తున్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నీలో కొత్త జిల్లాలైన మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల నుంచి 5 జట్లు హాజరవుతున్నాయి. టోర్నీలో 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర టోర్నీలో పాల్గొనే జట్టుకు ఎంపిక చేయనున్నారు. టోర్నీలో పాల్గొనే మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు బాదేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో శిక్షణ కొనసాగుతుంది.

8 నుంచి రాష్ట్రస్థాయి టోర్నీ..

ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో బాదేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఈ నెల 8, 9, 10 తేదీల్లో అండర్‌–17 ఫుట్‌బాల్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు చెప్పారు.

డయాలసిస్‌ సేవలు

వినియోగించుకోండి

జడ్చర్ల టౌన్‌: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో విర్కో కంపెనీ సహకారంతో మహావీర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సోమశేఖర్‌ అన్నారు. సెంటర్‌లో 10 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కిడ్నీ రోగులు ముఖ్యంగా హిమో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు సెంటర్‌ను సంప్రదించాలన్నారు. డయాలసిస్‌ సెంటర్‌లో డబుల్‌ ఆర్‌ఓ వాటర్‌ ద్వారా నిష్ణాతులైన టెక్నీషియన్స్‌ పనిచేస్తారన్నారు. ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు డయాలసిస్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం సెంటర్‌లో 18 మంది సేవలు పొందుతున్నారని, ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, కిడ్నీ వ్యాధిగ్రస్తులు తాజా రిపోర్టులు తీసుకుని కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement