ఆర్టీసీకి కాసుల వర్షం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి కాసుల వర్షం

Published Sat, Dec 2 2023 1:04 AM

- - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా పండుగ రోజుల్లో రీజియన్‌ పరిధిలో ప్రయాణికుల కోసం 374 ప్రత్యేక బస్సులు నడపగా మంచి ఆదాయాన్ని వచ్చింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ మెరుగైన ఆదాయం సాధించింది. ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లడంతో గత నెల 29న రీజియన్‌లోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ప్రజలు తమ సొంత గ్రామాలకు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు బస్సులు రద్దీగా వెళ్లాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంది. మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి నారాయణపేట, తాండూరు, మద్దూరు, కొత్తకోట, పరిగి, నాగర్‌కర్నూల్‌ రూట్లలో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా కనిపించింది. 29 నుంచి మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ప్రయాణికుల రద్దీ ఎన్నికల పోలింగ్‌ రోజు 30వ తేదీ ఉదయం వరకు కొనసాగింది. దీంతో 29న మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోని పది డిపోల బస్సులు 2,49,500 కిలోమీటర్లు తిరిగి.. రూ.1,38,29,158 ఆదాయాన్ని రాబట్టాయి. అలాగే 30న 2,51,738 కిలోమీటర్లు తిరిగి.. రూ.2,13,16,021ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఆయా కేంద్రాలకు ఉద్యోగులను తరలించడానికి రీజియన్‌ నుంచి 242 ప్రత్యేక బస్సులు నడిపారు.

గత నెలలో దసరా..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు అధిక ఆదాయం వచ్చింది. అక్టోబర్‌ 19 నుంచి 29 వరకు రీజియన్‌ రూ.15.21,09,703 ఆదాయం వచ్చింది. అదేవిధంగా అక్టోబర్‌ 26న మహబూబ్‌నగర్‌ రీజియన్‌ రూ.2,04,92,917 మెరుగైన ఆదాయాన్ని సాధించింది. ఒక్క రోజే రీజియన్‌లో బస్సులు 3,26,713 కిలోమీటర్లు తిరగగా ఈ ఆదాయం వచ్చింది. మహబూబ్‌నగర్‌ డిపో రూ.32,38,625, వనపర్తి రూ.26,85,564, గద్వాల రూ.25,43,911, కల్వకుర్తి రూ.23,94,249 ఆదాయాన్ని సాధించాయి.

రీజియన్‌కు ఎన్నికల వేళ అధిక ఆదాయం

పోలింగ్‌ను పురస్కరించుకొని 242 ప్రత్యేక బస్సుల నిర్వహణ

29, 30 తేదీల్లో ప్రయాణికుల తాకిడి

రెండురోజుల వ్యవధిలో

రూ.3.51 కోట్ల రాబడి

1/2

గత నెల 29న మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ (ఫైల్‌)
2/2

గత నెల 29న మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ (ఫైల్‌)

Advertisement
Advertisement