కిటకిటలాడిన కురుమూర్తిగిరులు | Sakshi
Sakshi News home page

కిటకిటలాడిన కురుమూర్తిగిరులు

Published Thu, Dec 7 2023 12:26 AM

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు 
 - Sakshi

చిన్నచింతకుంట: కురుమూర్తి ఉత్సవాలకు బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో రద్దీ కనిపించింది. భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో బారులుతీరారు. పలువురు భక్తులు మెట్లపై దీపాలు వెలిగిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకున్నారు. మరికొందరు కొండ దిగువన మట్టికుండలో దాసంగాలు పెట్టి, గండదీపాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న అలువేలు మంగ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి, ఉద్దాల మండపం వద్ద రద్దీ కనిపించింది. జాతర మైదానంలోని ఆట వస్తువులు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రంగుల రాట్నాల వద్ద జనం రద్దీ కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కురుమూర్తి కోడేల వేలం..

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పలువురు భక్తులు స్వామివారికి సమర్పించిన కోడెదూడలకు బుధవారం ఆలయ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలంతో ఆలయానికి రూ.1.79 లక్షల ఆదాయం సమకూరిందని ఈఓ మదనేశ్వరెడ్డి, చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శివానందాచారి, శ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతర మైదానంలో కొనుగోలుదారుల రద్దీ
1/1

జాతర మైదానంలో కొనుగోలుదారుల రద్దీ

Advertisement
Advertisement