రేషన్‌ కారు్డలు వచ్చేనా..? | Sakshi
Sakshi News home page

రేషన్‌ కారు్డలు వచ్చేనా..?

Published Sun, Dec 17 2023 10:16 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌/ అచ్చంపేట: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సామాన్య ప్రజల్లో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారంటీల పథకాలతోపాటు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. వీటి అమలులో లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌ కార్డులు కీలకం కానున్న నేపథ్యంలో కొత్త కార్డుల జారీ అంశం తెరపైకి వచ్చింది. 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు, కొత్తగా పెళ్లయిన వారు, ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. కేవలం చనిపోయిన వారి పేర్లు మాత్ర మే ఎప్పటిప్పడు తొలగించారు. గతంలో తెలుపు, గులాబీ రేషన్‌ కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీ కార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) వారికి ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్‌ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చింది. దీంతో కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి.. కొత్తగా బీపీఎల్‌ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా.. లేకపోతే కొత్తగా అర్హులను గుర్తిస్తారా.. అనేది వేచిచూడాలి.

సంక్షేమ పథకాలు అందక..

కొత్త రేషన్‌కార్డుల మంజూరులో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కొత్త కార్డులు పొందేందుకు కొందరు, ఉన్న కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం మరికొందరు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడిచాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయవడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మళ్లీ మోక్షం కలగలేదు. 2020 కరోనా సమయంలో లాక్‌డౌన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు అందజేసిన నిత్యావసర సరకులు, నగదు సాయం సైతం రేషన్‌కార్డులు లేని వందలాది కుటుంబాలకు అందలేదు. లాక్‌డౌన్‌ తర్వాత 2021 జూలైలో అప్పటి ప్రభుత్వం రేషన్‌ కార్డులు మంజూరు చేసినట్లే చేసి అర్ధంతరంగా నిలిపివేసింది. కనీసం ఎన్నికల ముందైనా రేషన్‌కార్డులు ఇస్తారని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఎన్నికల ముందు తెరపైకి తెచ్చిన గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర పథకాలకు రేషన్‌ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్తగా పెళ్లయ్యి రేషన్‌కార్డు రాని వారు అనర్హులు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జిల్లాలో భారీగా దరఖాస్తులు...

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9,34,885 రేషన్‌ కార్డులు ఉన్నాయి. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి, కొత్త రేషన్‌ కార్డుల కోసం పౌరసరఫరాల శాఖకు 20,473 దరఖాస్తులు అందాయి. ఇందులో 17,970 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా.. మిగతా 2,503 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు.

ప్రభుత్వంపై ఆశలు

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరు పథకాల అమలుపై పేద ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి పథకంతోపాటు సన్నబియ్యం పంపణీ, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా పథకాలతోపాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం లభిస్తాయని అనేక కుటుంబాలు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి.

పదేళ్లుగా పేర్లు నమోదు కాక, కొత్త కార్డులు రాక అవస్థలు

అన్నిరకాల సంక్షేమ పథకాలకు దూరం

ఉమ్మడి జిల్లాలో

వేలాది దరఖాస్తుల పెండింగ్‌

నూతన ప్రభుత్వ ఏర్పాటుతో

లబ్ధిదారుల ఆశలు

1/1

Advertisement
Advertisement