కోయిల్‌సాగర్‌ నుంచి.. యాసంగికి సాగునీటి విడుదల | Sakshi
Sakshi News home page

కోయిల్‌సాగర్‌ నుంచి.. యాసంగికి సాగునీటి విడుదల

Published Tue, Dec 19 2023 12:32 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌   - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తామని కలెక్టర్‌ రవినాయక్‌ అన్నారు. యాసంగికి సవరించిన షెడ్యూల్‌ ప్రకారం సాగునీటిని విడుదల చేసేందుకు, అలాగే ప్రాజెక్టు కింద ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందించేందుకు జూరాల నుంచి అదనంగా ఒక టీఎంసీ నీటిని కోయిల్‌సాగర్‌కి ఎత్తిపోసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాక ఉపాధి హామీ పథకం కింద ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల్లో ఒండ్రుమట్టి, చెట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. ముందుగా ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లు ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో ఉన్న నీటి లభ్యత, దాని ద్వారా సాగయ్యే ఆయకట్టు, నీటి విడుదల షెడ్యూల్‌ తదితర వివరాలను తెలియజేశారు. అనంతరం కలెక్టర్‌ ప్రజాప్రతినిధులు, రైతుల సలహాలను తీసుకుని మాట్లాడారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల్లో ఒండ్రుమట్టి, చెట్ల తొలగింపు కోసం ఉపాధి హామీ కింద అంచనాలు రూపొందించాలని డీఆర్‌డీఓ యాదయ్యను ఆదేశించారు. అంతకు ముందు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక టీఎంసీ నీటిని తీసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సూచించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ జన వరి మొదటి వారంలో నీటిని విడుదల చేసి ఏప్రిల్‌ మూడో వారం వరకు నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు మాజీ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాల్వలు ఆధునీకరించినందున క్రాస్‌ రెగ్యులేటరీలు ఏర్పా టు చేయాలని, కోయిల్‌సాగర్‌ నుంచి పాలమూరుకు 0.36 టీఎంసీల నీటిని మిషన్‌ భగీరథ కింద ఇవ్వకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి ఇచ్చేలా భవిష్యత్‌లో చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ ఎస్‌ఈ చక్రధరం మాట్లాడుతూ నారాయణపూర్‌ నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోతుందని, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద సాధ్యమైనంత వరకు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.

కుడి, ఎడమ కాల్వల్లో ఒండ్రుమట్టి,చెట్ల తొలగింపునకు చర్యలు

కలెక్టర్‌ రవినాయక్‌ వెల్లడి

Advertisement
Advertisement