భక్తుల కొంగు బంగారం.. పబ్బతి హనుమాన్‌ | Sakshi
Sakshi News home page

భక్తుల కొంగు బంగారం.. పబ్బతి హనుమాన్‌

Published Fri, Dec 22 2023 1:18 AM

ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం  - Sakshi

అమ్రాబాద్‌: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైన మద్దిమడుగులో దీక్షా మాల విరమణ ఉత్సవాలు శుక్రవారం నుంచి 26 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ వెలిసిన పబ్బతి ఆంజనేయ స్వామిని పిలిస్తే పలికే దైవంగా, కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు పూజిస్తారు. నల్లమల కొండల్లో ప్రకృతి రమణీయ ప్రదేశంలో వెలిసిన అంజన్న క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర దిశగా ఉంటుంది. ఈ ఆలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మద్దిమడుగులో ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మాల విరమణ భక్తులకు ప్రత్యేకషెడ్లు ఏర్పాటు చేశారు. నీటి సమస్య లేకుండా (సింతటిక్‌) మినీ ట్యాంకులు ఉన్న స్నాన ఘట్టాలతో పాటు మరో 24 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. పదరప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించనున్నారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా నల్గొండ, హైదరాబాద్‌, ఏపీ తదితర ప్రాంతాల నుంచి మాల ధరించిన స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో మాచర్ల, దేవరకొండ, మిర్యాలగూడా, అచ్చంపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్‌ డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు.

ఏటా రెండుసార్లు ఉత్సవాలు

మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఏటా రెండు పర్యాయాలు జరుగుతాయి. కార్తీక మాసంలో దీక్షమాల విరమణ, చైత్రమాసంలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయ స్వామి మాలను ధరిస్తారు. 40 రోజుల కఠోర దీక్ష అనంతరం ఇరుముడులతో ఆలయం వద్దకు వచ్చి స్వామివారికి సమర్పించి దీక్ష విరమణ చేస్తారు.

ఉత్సవాల వివరాలు..

22న ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వరపూజ పుణ్యాహవచనం, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ద్వజారోహణ

23 విఘ్నేశ్వరపూజ, పంచగవ్యం, వాస్తుపూజ హోమం, రుద్రహోమం, సహస్రనామార్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, నిత్యౌపాసన, మన్యుసూక్తహోమం, తీర్థప్రసాద వితరణ, రాత్రికి అమ్మవారిసేవ

24న విఘ్నేశ్వరపూజ, గవ్యాంతపూజలు, రుద్రహోమం, నిత్యౌపాసన, బలిహరణ, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పములు, శివపార్వతుల కల్యాణం

25న విఘ్నేశ్వరపూజ, గవ్యాంతరపూజలు, రుద్రహోమం, నిత్యౌపాసన, హనుమత్‌ వ్రతం, తీర్థ ప్రసాదవితరణ, సీతారాముల కల్యాణం

26న గవ్యాంతపూజలు, ఆంజనేయ స్వామికి 108 కలశాలతో అభిషేకం, హనుమాన్‌ గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు.

మద్దిమడుగు క్షేత్రంలో నేటి నుంచి దీక్ష విరమణ ఉత్సవాలు

26న హనుమాన్‌ గాయత్రీ మహాయజ్ఞం

ప్రత్యేక అలంకరణలో పబ్బతి హనుమాన్‌
1/1

ప్రత్యేక అలంకరణలో పబ్బతి హనుమాన్‌

Advertisement
Advertisement