ఉరేసుకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని వ్యక్తి మృతి

Published Fri, Dec 22 2023 1:18 AM

- - Sakshi

జడ్చర్ల: అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నెక్కొండలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెక్కొండకు చెందిన శివయ్య(28) తెల్లవారుజామున నిద్రలేచి వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతిపై భార్య మంజుల, బంధువులు అనుమానంతో ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త ఆత్మహత్య చేసుకోలేదని, తనకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు అంగీకరించకపోవడంతో సీఐ రమేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పోస్టుమార్టం నివేదిక మేరకు దర్యాప్తు చేపడుతామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మాద్వార్‌లో విషాదం

మక్తల్‌: కూతురి పుట్టినరోజు సందర్భంగా కేక్‌ తెచ్చేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం తీవ్ర విషాదం రేపింది. ఈ ఘటన మక్తల్‌ మండలం మాద్వార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాద్వా ర్‌కు చెందిన తుంగరాము (30) తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రాత్రి కేక్‌ తెచ్చేందుకు అదే గ్రామానికి చెందిన రఘుతో కలిసి బైక్‌పై మక్తల్‌కు వెళ్లి వస్తుండగా.. గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వారిద్దరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. తుంగ రాము మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య నవీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆచారి తెలిపారు.

మొసలి కలకలం

గట్టు: గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామశివారులో గురువారం మొసలి సంచారం కలకలం రేపింది. నెట్టెంపాడు కాల్వ సమీపంలోని రైతు పోతుల రామయ్య పొలంలో ఉన్న నీటిగుంతలో మొసలి కనిపించడంతో సమీప వ్యవసాయ పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులు, గొర్రెలు, చిన్న పిల్లలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మొసలి బారి నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

భూ తగాదాపై

కేసు నమోదు

జడ్చర్ల: బూరెడ్డిపల్లి శివారులో 44వ నంబర్‌ జాతీయ రహదారిని అనుసరించి ఉన్న భూమి విషయంలో బుధవారం జరిగిన దాడి ఘటనపై గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. బాధితుడు గూళ్ల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివవరించారు. కాగా నిందితులు విచక్షణా రహితంగా కర్రలతో దాడులు చేశారని చర్యలు చేపట్టాలని బాధితుల తరపున గ్రామస్తులు సీఐ కలిసి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement