పాలమూరు బాధ్యత నాదే..! : సీఎం రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

పాలమూరు బాధ్యత నాదే..! : సీఎం రేవంత్‌రెడ్డి

Published Thu, Mar 7 2024 4:40 AM

- - Sakshi

దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం

విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తాం

కాంగ్రెస్‌ ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ నుంచే హస్తం లోక్‌సభ ఎన్నికల శంఖారావం

అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పాలమూరులో విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయించి వేగంగా పూర్తి చేస్తాం.. దేశంలోనే పాలమూరు ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. ఇక్కడి బిడ్డగా పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాదే’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ బహిరంగసభలో ఆయన పాల్గొని లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ 3,650 రోజులు, కేంద్రంలో మోదీ 3,650 రోజులు అధికారంలో ఉన్నారని.. వీళ్లు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచి పాలమూరుకు వస్తే ఆయనను ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు.

ఆనాడు తుమ్మిళ్ల వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి మరిచాడని, పదేళ్లు అయినా ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి జిల్లాలో ఉన్న ఆర్డీఎస్‌, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు, కల్వకుర్తి, కొడంగల్‌– నారాయణపేట ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని, పచ్చని పంటలు పండాలనే ఉద్దేశంతో సమీక్ష చేశామన్నారు.

ఈ ధైర్యం ఇక్కడి బిడ్డల చలువే..
ఆనాడు హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడినప్పుడు నెహ్రూ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును మొదటి సీఎంగా చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఈ పదేళ్లు దుర్మార్గుడు, దుష్టుడు రాష్ట్రాన్ని పరిపాలించాడన్నారు.

గుర్తించిన ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, అన్నివర్గాల లక్షలాది మంది ప్రజలు నడుం బిగించి రాష్ట్రానికి పట్టిను పీడ నుంచి విముక్తి కల్పించారన్నారు. డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగా.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ సహకారంతో మళ్లీ పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు.

మా తాతలు, ముత్తాతలు ముఖ్యమంత్రి కాదు.. రూ.లక్షల కోట్లు ఇవ్వలేదు.. మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలేదు.. 2006లో సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచానని.. మిడ్జిల్‌ జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరందరూ కష్టపడి నన్ను గెలిపించారన్నారు. తెలంగాణలో సీఎంగా నిటారుగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరితోనైనా కొట్లాడటానికి ఈ ధైర్యం ఉందంటే పాలమూరు బిడ్డలు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కారణం అన్నారు.

  • పాలమూరు ప్రజాదీవెన బహిరంగ సభ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగింది.
  • సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 6.28 గంటలకు ఎంవీఎస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదికపైకి వచ్చారు.
  • కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు జీఎంఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డిని మొదట సత్కరించారు.
  • సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన భారీ చిత్రపటాన్ని కాంగ్రెస్‌ నేతలు అందజేశారు.
  • రాత్రి 7.38 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభమై.. రాత్రి 8.17 గంటలకు ముగిసింది. మొత్తం 39 నిమిషాల పాటు మాట్లాడారు.
  • రాత్రి 8.20 గంటలకు సీఎం కాన్వాయ్‌ సభాస్థలం నుంచి బయలుదేరి క్రిస్టియన్‌పల్లి నుంచి బైపాస్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లింది.
  • సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జనంలో మధ్యలో ఓ యువకుడు గురుకులాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్లకార్డు ప్రదర్శించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
  • జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి భోజనం చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు.

చల్లా, మన్నెను గెలిపించాలి..
ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్పీ ఎన్నికలు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా మన్నె జీవన్‌రెడ్డిని అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించనుంది. ఆ రోజు నన్ను ఏ విధంగా గెలిపించారో.. జీవన్‌రెడ్డిని అదేవిధంగా గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆయన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల మర్యాదను కాపాడుతారన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్‌ అభ్యర్థిని గెలిపించాలని.. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు.

మూడు, ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇటు కేసీఆర్‌, అటు మోదీ అంటున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. పాలమూరోడు సీఎం అయిండని కేసీఆర్‌ అసూయ పడుతున్నారని.. పాలమూరు బిడ్డ సీఎం కాకూడదా.. ఇక్కడి ప్రజలు విద్యావంతులు కాదా అని ప్రశ్నించారు. 2014లో నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీగా నిలబడినప్పుడు పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక మెజార్టీ రావాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. పాలమూరులో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను బొందపెట్టాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రసంగించారు.

ఇవి చదవండి: ఎవరు ఎటువైపు.. ‘గులాబీ’ గూటికి పగుళ్లు!

Advertisement

తప్పక చదవండి

Advertisement