● గ్రామాల్లో సామూహిక వివాహాలు ● దాతల సహకారం.. ● పేద కుటుంబాలకు తగ్గుతున్న భారం | Sakshi
Sakshi News home page

కల్యాణం.. సామూహిక(త)ం

Published Thu, May 25 2023 9:44 AM

- - Sakshi

కల్యాణం.. సామూహిక(త)ం

ఎన్ని పెళ్లిళ్లయినా ఖర్చు అంతే..

నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం ఝరి(బి) గ్రామంలో కరోనాకు ముందు సామూహిక వివాహాలు జరిపించేవారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నిర్వహించడం లేదు. అంతకుముందు తొమ్మిదేళ్లలో ఏ టా పెళ్లిళ్లు జరిపిస్తూ 150 జంటలను ఏకం చేశారు. ఇదే మండలంలోని సింగన్‌గాం గ్రామంలో 20, బోరిగాంలో 20 జంటలకు నాలుగైదేళ్ల క్రితం వివా హం జరిపించారు. ఒక పెళ్లి జరిపించినా.. సామూహిక వివాహాలు జరిపించినా ఖర్చు అంతే వస్తుందని గ్రామస్తులు కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికొడుకు తరఫున రూ.30 వేలు, పెళ్లికూతురు తరఫున రూ.20 వేలు వసూలు చేసి భోజనాల ఖర్చుగా వెచ్చించేవారు.

● కుమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం శివపెల్లి గ్రామంలో గత ఏడాది ఫిబ్రవరి 2న సామూహిక వివాహాలు జరిపించారు. శివాలయం వద్ద కొత్తపల్లి చంద్రయ్య, లక్ష్మి మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ 101 ఆదివాసీ జంటలకు వివాహం జరిపించారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, నాయకులు హాజరై కొత్త జంటలను ఆశీర్వదించారు. ప్రతీ జంటకు బట్టలు, పుస్తెమెట్టెలు, దేవుళ్ల చిత్రపటాలు, వంటసామగ్రి తదితర వస్తువులతో కిట్‌ కానుకగా అందజేశారు. కొత్తపల్లి శ్రీనివాస్‌ ఆదివాసీ గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఆదివాసీ గిరిజనుల ఆర్థిక పరిస్థితులు చూసి చలించిపోయారు. పెళ్లిళ్లు చేయడానికి వారు పడుతున్న ఇబ్బందులు దృష్టికి రావడంతో 50 జంటలకు సామూహిక వివాహం జరిపించాలని నిర్ణయించారు. చాలామంది ఆసక్తి చూపడంతో నెల రోజుల్లోనే ఆ సంఖ్య కాస్త 101కి చేరింది. దీంతో రూ.20లక్షలు వెచ్చించి ఆలయంలో సామూహిక వివాహాలు జరిపించారు.

● ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్‌ గ్రామంలో 38 ఏళ్ల క్రితం ప్రారంభమైన సామూహిక వివాహాల ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఈ ఏడాది మే 4న నాలుగు జంటలకు ఒకే వేదికపై వివాహం జరిపించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లల పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. 38ఏళ్ల క్రితం కరువు ఏర్పడి రైతుల కుటుంబాలు వృథా ఖర్చులను అరికట్టేందుకు 1984లో సామూహిక వివాహాలు చేయడానికి నిర్ణయించాయి. అప్పటి నుంచి ఈ ఆనవా యితీ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ వేదిక ద్వారా సుమారు 800 జంటలు ఒక్కటయ్యాయి.

● ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్‌ గ్రామంలో ఆంద్‌ ఆదివాసీ కుల గురువు శ్రీసంత్‌ పూలాజీబాబా ప్రేరణతో పూలాజీబాబా ధ్యాన్‌ మందిర్‌ ఉత్సవ కమిటీ, ఆంద్‌ ఆదివాసీ సేవా సంఘం ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఏటా ఐదు నుంచి పది జంటలు ఏకమవుతున్నాయి. దస్నాపూర్‌గూడ, హర్కపూర్‌ఆంద్‌గూడ, అంజీ, మామిడిగూడ గ్రామాల్లో సామూహికంగా వివాహాలు జరిపిస్తున్నారు. ఈ ఏడాది మే 2న హర్కపూర్‌ ఆంద్‌గూడలో నిర్వహించిన వేడుకల్లో ఐదు జంటలు, దస్నాపూర్‌గూడలో మూడు, అంజీలో ఐదు జంటలు ఏకమయ్యా యి. ఖర్చులు తగ్గడంతోపాటు గ్రామాల మధ్య స్నేహభావం పెంపొందుతుందని ఆంద్‌ ఆదివాసీ పెద్దలు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బందులు తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక్కో జంట నుంచి రూ.20 వేల నుంచి రూ.25వేలు కమిటీ సభ్యులు సేకరిస్తారు.

ఎమ్మెల్యే కోనప్ప కూతురి పెళ్లితోపాటే..

కుమురంభీం జిల్లా సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. కోనప్ప తన కూతురు మధులిక వివాహం సమయంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో 11జంటలకు వివాహం జరిపించి తండ్రి హృదయాన్ని చాటుకున్నారు.

కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్రీడామైదానంలో 2014లో 113 జంటలకు పెళ్లి జరిపించారు.

కౌటాల మండలం ప్రాణహిత సమీపంలో ఓ సంవత్సరం ఎనిమిది జంటలకు, మరో ఏడాది 16జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.

2018లో బెజ్జూర్‌ మండలం సౌమిని ప్రాణహిత వద్ద 103 జంటలకు వివాహాలు చేయించారు. 2021లో పెంచికల్‌పేట మండలం భద్రకాళి ఆలయంలో 126 జంటలకు వివాహాలు జరిపించారు.

పెళ్లి సమయంలో నూతన జంటలకు మంగళసూత్రాలు, పెళ్లిబట్టలు, బీరువా, తినుబండారాలు, వంట పాత్రలు అందజేస్తుంటారు. పెళ్లికి వచ్చిన బంధువులకు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.

సాక్షి మంచిర్యాల డెస్క్‌: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగానే మారుతున్నాయి. పెళ్లి చేయాలంటే టెంటు సామగ్రి నుంచి మొదలుకుని ఫంక్షన్‌ హాల్‌, బ్యాండుమేళాలు, వీడియో, ఫొటోగ్రఫి, విందు భోజనాలతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నేటి ఆధునిక కాలంలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు అ‘ధన’పు భారాలే అవుతున్నాయి. ఇక కట్నకానుకల సంగతి సరేసరి.. పేద కుటుంబాల్లో పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏటా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. కూతురు పెళ్లి చేయడానికి అప్పు పుట్టలేదని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి ముత్తన్నపేటలో తండ్రి వేల్పుల అయిలయ్య ఈ నెల 20న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సామూహిక వివాహాల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా జరుగుతున్న సామూహిక వివాహాలపై ప్రత్యేక కథనం.

ఆర్థిక పరిస్థితులు చూసి చలించిపోయా..

సిర్పూర్‌ నియోజకవర్గంలోని ఆదివాసీ గిరి జన గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఆదివాసీ గిరిజనుల ఆర్థిక పరిస్థితులు చూసి చలించిపోయాను. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆదివాసీలు వివాహం చేసుకుని ఇబ్బందుల్లో ఉన్నారని అర్థమైంది. వారికి అండగా ఉండాలని సామూహిక వివాహాల నిర్ణయం తీసుకున్నాను. స్థానిక ఆదివాసీ నాయకుల సహకారంతో అర్హులైన జంటలను గుర్తించి కొత్తపల్లి చంద్రయ్య, లక్ష్మి మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించాను. ట్రస్టు ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లు అందజేస్తున్నాం. కంటిపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి బెల్లంపల్లిలో కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయిస్తున్నాం. మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – కొత్తపల్లి శ్రీనివాస్‌,

బీజేపీ కుమురంభీం జిల్లా అధ్యక్షుడు

1/2

2/2

Advertisement
Advertisement