‘డబుల్‌’ ఇళ్లు పూర్తయ్యేదెప్పుడో..! ఆరేళ్లుగా సాగుతున్న పనులు | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్లు పూర్తయ్యేదెప్పుడో..! ఆరేళ్లుగా సాగుతున్న పనులు

Published Fri, Jun 23 2023 1:28 AM

ప్లాస్టరింగ్‌ పూర్తయిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు  - Sakshi

బెల్లంపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో బెల్లంపల్లిలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. కన్నాల శివారు జాతీయ రహదారిని ఆనుకుని 2017 జూన్‌ 10న ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై ఆరేళ్లు కావస్తుండగా ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక అవరోధాలతో అపసోపాలు పడుతూ ప్రస్తుతం సగానికి పైగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు తుది దశకు చేరాయి. రూ.968 లక్షల అంచనాతో 160 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణ వ్యయం యేటా పెరుగుతుండగా ఇప్పటికే పూర్తి కావాల్సిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

తుది దశలో పనులు..
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించిన పైపులైన్‌ పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క పైపులైన్‌ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు బిగించాల్సి ఉంది. ఆయా పనులు పూర్తయితే దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లే. 160 ఇళ్లకు గాను పైపులైన్‌ పనులు 100 ఇళ్ల వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌కు గత రెండేళ్లుగా బిల్లులు చెల్లించపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

కేటాయిపులపై ఆశలు
అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తంతు ప్రారంభం కాకముందే పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి ముందస్తుగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను పేదల పరం చేసి ఎన్నికలకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పనులు తుది దశలో ఉండడంతో పేదలు ఆశలు పెంచుకుంటున్నారు. నోటిఫికేషన్‌ వచ్చేలోగానే అర్హులకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు.

గృహలక్ష్మి వైపు చూపులు..
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఈసారి కూడా పూర్తికాని పరిస్థితులు ఏర్పడితే లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం వైపు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతింటి స్థలం ఉన్న లబ్ధిదారులకు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో పేదల్లో ఆశలు రేకేత్తిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి లీజు భూములు ఉన్నాయి. ఇటీవలనే ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు పట్టాలు కూడా జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 వేల మందికి ఇళ్లపట్టాలు వచ్చే అవకాశాలు ఉండగా, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పూర్తికాని పక్షంలో నివేశన స్థలం ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సమాలోచనలు చేస్తున్నారు.

పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు పైపులైన్‌ పనులు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లనిర్మాణ పనులు పూర్తి చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్‌ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. బిల్లుల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది.

– పెద్దయ్య, ఆర్‌అండ్‌బీ ఇంచార్జి ఈఈ, మంచిర్యాల

Advertisement
Advertisement