TS Manchirial Assembly Constituency: TS Election 2023: కాంగ్రెస్‌లోకి కీలక నేత ఎవరు..?
Sakshi News home page

TS Election 2023: కాంగ్రెస్‌లోకి కీలక నేత ఎవరు..?

Published Thu, Aug 24 2023 1:00 AM

- - Sakshi

మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా రాజకీయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏ పార్టీలో ఉంటే మంచిదనే సమాలోచనలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే పార్టీ, ప్రాధాన్యత ఇచ్చే చోటు కోసం వెతుకుతున్నారు.

బీఆర్‌ఎస్‌లో టికెట్ల కేటాయింపు పూర్తవడంతో మిగిలిన పార్టీ ల్లో అవకాశాల కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇక కింది స్థాయి నాయకులు సైతం ఎక్కడ తమకు అన్ని రకాల బాగుంటుందో బేరీజు వే సుకుని కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చి మూడు నెలల ముందుగానే ఎన్నికల కదనరంగంలోకి దూకింది.

తర్జనభర్జనలో మాజీ ఎంపీ..
జిల్లా పరిధిలో ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ ఎంపీ పార్టీ మారేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పుడున్న పార్టీతో జిల్లాలో ఎదుగూ బొదుగు లేదని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పార్టీ మారిన ఆయన మళ్లీ వేరే పార్టీలో చేరడంపై ప్రజలు, అటు అనుచరుల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు.

ఇక తనకు ఆ పార్టీలో ఎలాంటి హామీలు ఇస్తారనే దానిపైనా సంప్రదింపులు జరిపి ఓ కొలిక్కి వచ్చాక పార్టీ మార్పు జరగొచ్చని సమాచారం. ప్రాంతీయ పార్టీ తన రాజకీయ భవిష్యత్‌ను కష్టాల్లో నెట్టడంతో జాతీయ పార్టీలో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఎస్సీ రిజర్వు స్థానాల్లో పోటీ చేస్తారని తన అనుచరులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ తన స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, నాయకులు అయోమయంలో ఉన్నారు.

ఈ క్రమంలో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. దీంతో సదరు నాయకుడు మళ్లీ ఏ పార్టీలో చేరి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే కోణంలో సుదీర్ఘంగా ఆలోచించి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార పార్టీ నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచనలో పడినట్లు సమాచారం.

టికెట్‌ కోసం పోరాటం..
జిల్లాలో జనరల్‌ సీటుగా ఉన్న మంచిర్యాలపై అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. ఓసీ, బీసీ నేతలు టికెట్‌ ఇచ్చే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న నాయకులు టికెట్‌ దక్కించుకునేందుకు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో వేచి చూస్తున్నారు. కొందరు బీజేపీ, తర్వాత బీఎస్పీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నా యి. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ‘ముందుగా చేరండి’ అని స్వాగతం పలుకుతున్నప్పటికీ టికెట్‌ ఇస్తామనే నమ్మకం ఇవ్వకపోతున్నాయి.

సీటు రాకపోయినా..
వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా పోటీ చేస్తామని ప్రజల్లో తిరుగుతున్న నేతలు సీటు రాకపోతే ఇప్పుడున్న పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయా పార్టీలో ఇద్దరు, ముగ్గురు నాయకులు సీటు కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకరికి మాత్రమే సీటు దక్కే అవకా శం ఉంది. మిగతా వారంతా వెనక్కి తగ్గి పని చేసే తీరు కనిపించడం లేదు. కొందరు రెబెల్‌గానైనా పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమయం వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తేలనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement