వెలమల క్షేత్రం..! | Sakshi
Sakshi News home page

వెలమల క్షేత్రం..!

Published Fri, Oct 20 2023 1:48 AM

- - Sakshi

● బీసీలకు రెండేసార్లు అవకాశం ● కార్మిక, కర్షక ప్రాంతం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం వెలమలకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. పునర్విభజనకు ముందు లక్సెట్టిపేట నియోజకవర్గంలో మొదటి నుంచీ అగ్రవర్ణాలకు అధికారం దక్కింది. కార్మిక, కర్షక ఓటర్లు ఎక్కువగా ఉన్నా రాజకీయ ప్రస్థానం అలాగే కొనసాగుతోంది. లక్సెట్టిపేట నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటివరకు 16 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గం నేతలే ఎక్కువ కాలం పాలించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గం కాగా.. సోషలిస్ట్‌ పార్టీ ప్రభావం ఉన్న రోజుల్లో ఆ పార్టీ తరఫున కోదాటి రాజమల్లు, విశ్వనాథం ఒకే పర్యాయం శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మంచిర్యాల నియోజకవర్గంగా ఆవిర్భవించింది. మొదటి ఎమ్మెల్యేగా గడ్డం అరవిందరెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికయ్యారు. 2010 ఉప ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నడిపెల్లి దివాకర్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కీలక పదవులు

లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు కీలక పదవుల్లో కొనసాగారు. జేబీ.నర్సింగరావు పీసీసీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా, జీవీ.సుధాకర్‌రావు నీటి పారుదల, రవాణా, చక్కెర శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

విలక్షణ తీర్పు..

నియోజకవర్గ ప్రజలు విలక్షణమైన తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ సాధించిన ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు జీవీ.పితాంబర్‌రావు, జీవీ.సుధాకర్‌రావు, జేవీ.నర్సింగరావు, దివాకర్‌రావు వరుసగా రెండేసి సార్లు ఎన్నికై నా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం దక్కలేదు.

కార్మికులు, వ్యవసాయం

మంచిర్యాల నియోజకవర్గానికి తూర్పున సింగరేణి కార్మిక క్షేత్రం, పశ్చిమాన వ్యవసాయ క్షేత్రం ఉండగా, మధ్యలో మంచిర్యాల విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఏ ఎన్నికల్లో అయినా సింగరేణి క్షేత్రంలోని కార్మికులే నేతల రాతలు మారుస్తున్నారు. 10 వేల వరకు సింగరేణి కార్మిక కుటుంబాలు ఉండగా దాదాపు 45 వేలకు పైగా ఓటర్లు ఉంటారు. బీసీ ఓటర్లు కీలకంగా ఉన్నా చట్టసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం లేదు. 2.65లక్షల పైగా ఓటర్లు ఉండగా ఇందులో దాదాపు రెండు లక్షల వరకు బీసీ ఓటర్లు ఉంటారు.

నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్‌, లక్సెట్టిపేట మున్సిపాలిటీలు, హాజీపూర్‌, దండేపల్లి మండలాలు ఉన్నాయి. 2,64,515 మంది ఓటర్లు ఉన్నారు. మున్నూరు కాపు, పెరిక ఓటర్ల ప్రాతినిధ్యం అధికంగా ఉండగా ఆ తర్వాత వరుసలో ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ, బెస్త, వైశ్య, పద్మశాలి, రెడ్డి, వెలమ, ఎల్లాపు ఇతర కులాల వారు ఉంటారు.

ఉప ఎన్నికలు ఇలా..

1973లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జేవీ.నర్సింగ్‌రావు అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మందమర్రికి చెందిన న్యాయవాది కేవీ.కిషన్‌రావు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు కావడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి 2010లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో అరవింద్‌రెడ్డి 86 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు.

ఎన్నో ప్రత్యేకతలు..

మంచిర్యాల గోదావరి పరీవాహక ప్రాంతం ఉంది. తూర్పున శ్రీరాంపూర్‌లో నల్ల బంగారం నిక్షిప్తమైన సింగరేణి భూగర్భ, ఉపరితల(ఓపెన్‌ కాస్ట్‌) గనులు ఉన్నాయి. మంచిర్యాలలో ఎంసీసీ సిమెంట్‌ ఫ్యాక్టరీ, పరిసర ప్రాంతాల్లో సిరామిక్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ ప్రాజెక్ట్‌ ఉంది. లక్సెట్టిపేటలో రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద చర్చి సీఎస్‌ఐ చర్చి ఉంది. దండేపల్లిలో చిన్నయ్య, పెద్దయ్య గుట్టలతో పాటు చప్పట్లతో జాలువారే నీటి ఊటలు ప్రత్యేకత.

మంచిర్యాల ముఖ చిత్రం

లక్సెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు..

ఎమ్మెల్యే పదవీ కాలం పార్టీ

విశ్వనాథరావు, కోదాటి రాజమల్లు 1952–57 సోషలిస్టు పార్టీ

జీవీ.పితాంబర్‌రావు 1957–62 కాంగ్రెస్‌

జీవీ.పితాంబర్‌రావు 1962–67 స్వతంత్ర

జేవీ.నర్సింగరావు 1967–72 కాంగ్రెస్‌

జేవీ.నర్సింగరావు 1972–73 కాంగ్రెస్‌

కేవీ.కిషన్‌రావు(ఉప ఎన్నిక) 1973–77 కాంగ్రెస్‌

చుంచు లక్ష్మయ్య 1977–83 జనతా పార్టీ

ఎం.మురళీమనోహర్‌రావు 1983–85 టీడీపీ

జీవీ.సుధాకర్‌రావు(ఉప ఎన్నిక) 1985–89 స్వతంత్ర

జీవీ.సుధాకర్‌రావు 1989–94 కాంగ్రెస్‌

గోనె హన్మంతరావు 1994–99 టీడీపీ

నడిపెల్లి దివాకర్‌రావు 1999–04 కాంగ్రెస్‌

నడిపెల్లి దివాకర్‌రావు 2004–09 కాంగ్రెస్‌

మంచిర్యాల నియోజకవర్గంలో...

గడ్డం అరవింద్‌రెడ్డి 2009–10 టీఆర్‌ఎస్‌

గడ్డం అరవింద్‌రెడ్డి(ఉప ఎన్నిక) 2010–14 టీఆర్‌ఎస్‌

నడిపెల్లి దివాకర్‌రావు 2014–18 టీఆర్‌ఎస్‌

నడిపెల్లి దివాకర్‌రావు 2018–23 బీఆర్‌ఎస్‌

కొదాటి రాజమల్లు
1/9

కొదాటి రాజమల్లు

జీ.వీ.పితాంబర్‌రావు
2/9

జీ.వీ.పితాంబర్‌రావు

జీవీ సుధాకర్‌రావు
3/9

జీవీ సుధాకర్‌రావు

గోనె హన్మంతరావు
4/9

గోనె హన్మంతరావు

చుంచు లక్ష్మయ్య
5/9

చుంచు లక్ష్మయ్య

మురళీమనోహర్‌రావు
6/9

మురళీమనోహర్‌రావు

కే.వి.కిషన్‌రావు
7/9

కే.వి.కిషన్‌రావు

గడ్డం అరవిందరెడ్డి
8/9

గడ్డం అరవిందరెడ్డి

నడిపెల్లి దివాకర్‌రావు
9/9

నడిపెల్లి దివాకర్‌రావు

Advertisement
Advertisement