సోదాలతో కలవరం! | Sakshi
Sakshi News home page

సోదాలతో కలవరం!

Published Wed, Nov 22 2023 12:16 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ (ఇన్‌కంటాక్స్‌), ఈడీ (ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌) అధికారుల తనిఖీలు నాయకుల్ని కలవరపెట్టాయి. మంగళవారం ఏక కాలంలో కాంగ్రెస్‌ నాయకుడు, చెన్నూరు అభ్యర్థి, మాజీ ఎంపీ, వివేక్‌ ఇల్లు, తాండూరు మండలం రేపల్లెవాడలోని మహేశ్వరి జిన్నింగ్‌ మిల్లులో విస్తృతంగా సోదాలు జరిగాయి. బెల్లంపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులే వాటాదారులుగా ఉన్న ఈ మిల్లులో తనిఖీలు చేయడం, ఇటు వివేక్‌ ఇంట్లో సోదాలతో అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌లోనూ కలవరం రేపింది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్న వేళ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం 5.30గంటలకే మాజీ ఎంపీ వివేక్‌ ఇంటికి చేరుకున్న అధికారులు ఏకధాటిగా 12గంటల పాటు సుదీర్ఘంగా సోదా చేశారు. ఆ సమయంలో వివేక్‌, ఆయన సతీమణి సరోజ, తనయుడు వంశీకృష్ణ, అల్లుడు వరుణ్‌ ఇంట్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయన ఇంటి ఎదుట ‘ఐటీ, ఈడీ.. గో బ్యాక్‌.., బాల్క సుమన్‌, కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌..’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌ తదితర నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు వివేక్‌ ఇంటి ఎదుటే రాత్రి దాకా ఉన్నారు. లోనికి ఎవర్నీ అనుమతించకపోవడంతో గేటు ముందే ఉండిపోయారు. సోదాల సమయంలో కేంద్ర పోలీస్‌ బలగాలతో పాటు స్థానిక సీఐ రాజు, ఏసీపీ తిరుపతిరెడ్డి సమక్షంలో బందోబస్తు నిర్వర్తించారు. డీసీపీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ పర్యవేక్షించారు.

తాండూర్‌ మండలం రేపల్లెవాడలోని

జిన్నింగ్‌ మిల్లులో తనిఖీలు

తాండూరు మండలం రేపల్లెవాడలోని మహేశ్వరి జిన్నింగ్‌ మిల్లులోనూ ఉదయం నుంచి రాత్రి దాకా సోదాలు జరిగాయి. ఆ సమయంలో మిల్లు సిబ్బంది, యజమానులను మాత్రమే పిలిచి వారి సమక్షంలో సోదాలు నిర్వహించారు. ఈ మిల్లు యజమానులుగా బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు మరికొందరున్నారు. ఈ మిల్లులో అధికారులు ఎందుకు సోదా లు చేశారనేది తెలియరాలేదు. పత్తి కొనుగోళ్లు ప్రా రంభమై రైతులు నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దాడులు చేయగా ఎవరైనా ఫిర్యాదు చేశారా? లేక? ఎన్నికల వేళ ఏవైనా అనుమానాస్పదంగా లావాదేవీలు జరిగాయా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కోసం రాజకీయ పార్టీ నాయకులు కొందరు వ్యాపారులపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ఐటీదాడులు అనేక విధాలుగా చర్చకు దారితీసింది.

జిల్లాలో ఐటీ, ఈడీ అధికారుల తనిఖీలు మాజీ ఎంపీ వివేక్‌, జిన్నింగ్‌ మిల్లులోనూ.. ఎన్నికల వేళ కలకలం రేపిన సోదాలు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఫిర్యాదుతోనే..!

వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ నుంచి రూ.8 కోట్లు అనుమానాస్పదంగా రామగుండంకు చెందిన ఒకరి ఖాతాలో జమైనట్లు చెన్నూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరోపించారు. విచారణ జరిపించాలని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈడీ, ఐటీకూడా విచారణ చేపట్టాలని కోరారు. స్పందించిన అధికారులు ఆ ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ రూ.50లక్షలు వివేక్‌ ఉద్యోగులు తరలిస్తూ పట్టుబడ్డారని కేసు నమోదైంది. దీనిపైనా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సుమన్‌ ఫిర్యాదుతోనే రంగంలోకి దిగిన అధికారులు ప్రధానంగా రూ.8కోట్ల నగదు బదిలీపైనే దృష్టి పెట్టి, సోదాలు చేశారు. ఈ మేరకు ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసి అధికారులు వెళ్లిపోయారు. అనంతరం వివేక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుమన్‌, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement
Advertisement