తునికాకు షెడ్యూళ్లపై నిరాసక్తత | Sakshi
Sakshi News home page

తునికాకు షెడ్యూళ్లపై నిరాసక్తత

Published Mon, Apr 8 2024 1:10 AM

అటవీ ప్రాంతంలో ఎదుగుతున్న తునికాకు - Sakshi

బెల్లంపల్లి: ప్రభుత్వం ఏటా అటవీశాఖ ఆధ్వర్యంలో తునికాకు సేకరణ జరుపుతుంది. యూనిట్ల వారీగా టెండర్లను ఆహ్వానించి కాంట్రాక్టర్ల ద్వారా అటవీ అధికారులు ఆకు సేకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తునికాకు టెండర్‌ షెడ్యూళ్ల కొనుగోలుకు గడిచిన నాలుగైదేళ్ల నుంచి సానుకూలత వ్యక్తం చేయడం లేదు. అతికష్టంగా ఒకటి ,రెండు యూనిట్లకు మాత్రమే టెండర్‌ షెడ్యూళ్లను కొనుగోలు చేసి మమ అనిపిస్తున్నారు. ఆకు సేకరణ ద్వారా లాభాలు అంతగా రావడంలేదనే కారణంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేక పోతున్నట్లు తెలుస్తుండగా తునికాకు సేకరణ లక్ష్యంపై ప్రభావం పడుతోంది. టెండర్‌ షెడ్యూల్‌ దాఖలు చేసి కాంట్రాక్టును చేజిక్కించుకున్నాక అటవీ అధికారులు నిర్దేశించిన యూనిట్‌ పరిధిలో చాక్‌తరస్‌ (కొమ్మ కొట్టే పనులు) చేపడుతారు. కూలీలతో కొమ్మకొట్టే పనుల ప్రక్రియను దాదాపు మార్చి మొదటి వారంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఏప్రిల్‌ నెలాఖరులోగా కొమ్మకొట్టే పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు అనుమతి మంజూరు చేశారు.

మూడు యూనిట్లలో షెడ్యూళ్ల అమ్మకాలు

బెల్లంపల్లి అటవీ డివిజన్‌ పరిధిలో బెల్లంపల్లి, కుశ్నపల్లి రేంజ్‌లు ఉండగా ఆయా రేంజ్‌ల పరిధిలో నార్వాయిపేట, కుశ్నపల్లి, వేమనపల్లి, బెల్లంపల్లి, ధర్మారావుపేట, తాండూర్‌, లింగాల, నెన్నెల యూనిట్లను ఏర్పాటు చేశారు. తునికాకు సేకరణ కోసం కేవలం నార్వాయిపేట, కుశ్నపల్లి, వేమనపల్లి యూనిట్లకు సంబంధించిన టెండర్‌ షెడ్యూళ్లు అమ్ముడు పోగా మిగతా 5 యూనిట్ల టెండర్‌ షెడ్యూళ్లను కొనుగోలు చేయకుండా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. కొనుగోలు చేయని యూనిట్లలో ఆకు సేకరణ జరిగే అవకాశాలు లేకుండా పోగా కూలీలకు మండుటెండలో ఉపాధి మృగ్యం కానుంది. గతేడాది కూడా సరిగ్గా ఇదే తీరుగా జరిగింది. నార్వాయిపేట, కుశ్నపల్లి, వేమనపల్లి యూనిట్ల షెడ్యూళ్లను కొనుగోలు చేసి ఆకు సేకరణ చేయడం గమనార్హం.

కట్ట ధర రూ.3

తునికాకు కట్ట ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అంచనా వేసి కూలీలకు గిట్టుబాటు ధర నిర్ణయించింది. 50 ఆకులను పేర్చి తునికాకు కట్టను తయారు చేస్తారు. ఒక్కో కట్టకు రూ.3 చెల్లించి అటవీ శాఖ తునికాకు ను సేకరిస్తుంది. నిర్దేశించిన గ్రామాల్లో కల్లెదార్లను ఎంపిక చేసి ఆకు సేకరణ చేయనున్నారు.

మే చివరి వారంలో ఆకు సేకరణ

ఆలస్యంగా కొమ్మకొట్టే పనులు జరగనుండటంతో ఆకు సేకరణ కూడా మరింత ఆలస్యం కానుంది. వారం రోజుల్లో చాక్‌తరస్‌ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చాక్‌ తరస్‌ చేశాక తునికాకు లేత చిగురు వచ్చి నాణ్యతగా ఎదగడానికి గరిష్టంగా 45 రోజుల కాలం పడుతుందనేది అటవీ అధికారుల అంచనా. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆకు సేకరణ పనులు మే చివరి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

8 యూనిట్లలో కేవలం మూడింటికే షెడ్యూళ్లు

లాభాలు రావడం లేదని కాంట్రాక్టర్లు దూరం

యూనిట్ల వారీగా ఆకు సేకరణ లక్ష్యం

యూనిట్‌ స్టాండర్డ్‌ బ్యాగులు

నార్వాయిపేట 1,600

కుశ్నపల్లి 1,400

వేమనపల్లి 3,000

బెల్లంపల్లి 700

ధర్మారావుపేట 800

తాండూర్‌ 600

లింగాల 1,600

నెన్నెల 3,000

మొత్తం 12,700

ఎండాకాలంలో గ్రామీణులకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మారుతున్న పరిస్థితుల ప్రభావంతో కాంట్రాక్టర్లు తునికాకు సేకరణ కోసం టెండర్‌ షెఢ్యూళ్లను కొనుగోలు చేయడానికి నిరాసక్తత చూపుతుండటం ప్రతి బంధంగా మారుతోంది. తద్వారా ఆకు సేకరణ లక్ష్యం పడి పోయి గ్రామీణ కూలీలకు ఉపాధి రోజులు తగ్గుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో అనాది నుంచి వస్తున్న తునికాకు సేకరణపై కూలీలు క్రమంగా ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

నెలరోజులు సుత ఆకు కోత్తలేరు

మునుపు నెల పదిహేను రోజుల దాక తునికాకు కోసేది. ఎండాకాలం వచ్చిందంటే మహ సంబురం అనిపించేంది. ఊరంతా కలిసి తెల్లారక ముందే అడవికి బోయి చెట్టుపుట్ట తిరిగి ఆకు సేకరించి అంబటాళ్లయ్యేసరికి ముల్లెలతో ఇంటికి వచ్చేది. ఇప్పుడు వారం, పది దినాలు సుత కాక ముందే ఆకు కోసుడు బంద్‌ జేత్తండ్లు. – కొద్దని చీకటి, నెన్నెల

ఎండాకాలంలో పని దొరుకుతుంది

ఎండాకాలంలో బతుకుదెరువు కోసం ఇంకో ఊరుకు వెళ్లకుండా తునికాకు సేకరణతో పనులు దొరుకుతయ్‌. కానీ సరిగ్గా ఆకు సేకరణ జరుగుత లేదు. ఇంటిల్లిపాదిమి అటవీ ప్రాంతానికి వెళ్లి ఆకు సేకరించడం వల్ల రోజు కూలీ లభించేది. జంగ్లాతోళ్లు కూలీలతో ఆకు సేకరణ పనులు చేయించాలె.

– మేకల లక్ష్మి, దాంపూర్‌

కట్ట ధర పెంచాలి

దినసరి సరుకుల ధరలు

రోజురోజుకూ మస్తు పిరమైతన్నయ్‌. ఎర్రటెండల ఆకు సేకరించే కూలీల గురించి సర్కారు ఇసారంజెయ్యాలె. గాసం ధరలు పెరుగుతున్నట్లు తునికాకు కట్ట ధర సుత ఇంకింత పెంచితే మంచి గుంటది. కట్టకు రూ.5 చొప్పున ధర చెల్లిస్తే పాయిద

ఉంటది. – కొండపల్లి వెంకటి, వేమనపల్లి

1/3

2/3

3/3

Advertisement
Advertisement